Bathukamma Celebrations Telangana 2023 : దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పండుగలను విద్యార్థులకు పరిచయం చేసేందుకు పెద్దపీట వేశారు. కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొని ఆడీపాడీ సందడి చేశారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. మాదాపూర్‌లోని శిల్పారామంలో, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో కిస్మాత్ పూర్ గ్రామంలో బతుకమ్మ(Bathukamma) సంబరాలు అంబరాన్నంటాయి. బాలానగర్, ఫతేనగర్‌లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. భాగ్యనగరంలోని పలు కాలనీల్లోనూ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
Engili Pula Bathukamma Celebrations in Telangana 2023 : పూలపండుగను ఖమ్మంలో మహిళలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆయా కాలనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో మహిళలంతా బతుకమ్మలు తీసుకువచ్చి ఆడారు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం బుర్హాన్‌పురం ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
Bathukamma Festival 2023 : నేటి నుంచే పూల సంబురం.. ఎంగిలి పూల బతుకమ్మతో పండుగ ప్రారంభం
Bathukamma Celebrations First Day 2023 : నల్గొండలో రంగురంగుల పూలతో అందంగా ఎంగిలి పూల బతుకమ్మను పేర్చారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలేరు, శారాజీపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వచ్చి ఏర్పాట్లపై ఆరా తీశారు. మోత్కూర్ మండలంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్(MLA Kishore Kumar).. తన సతీమణి కమలతో కలసి పాల్గొని ఆటపాటలతో అలరించారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో పసుపుతో చేసిన గౌరమ్మను పూజించి బతుకమ్మ నీటిలో వదిలి సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ వేడుకలతో అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.
ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ(Engili Pula Bathukamma )ను మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరోక్క పూలతో బతుకమ్మను పేర్చి మురిసిపోయారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడికి మహిళలు పోటెత్తారు. గౌరీదేవికి పూజలు చేసి భక్తి శ్రద్దలతో నైవేద్యాలు సమర్పించారు. ములుగు జిల్లాలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం.. బతుకమ్మలు ఆడిపాడే మహిళలతో కిటకిటలాడింది.
పరకాలలోని పశువుల సంత మైదానంలో ఘనంగా చేసుకున్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ ఘాట్ల వద్ద మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ.. కోలాటాలతో అలరించారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులతో యువతులు అదరగొట్టారు. జిల్లా వ్యాప్తంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మహిళలు యువతుల కోలాహలం నడుమ అట్టహాసంగా కొనసాగాయి.
బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు, ఎనిమిది నైవేద్యాలు
రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్