గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్యసేవలను సర్కార్ మరింత విస్తరిస్తోంది. కొత్తగా సంతోష్‌నగర్ డివిజన్‌లోని జవహార్ నగర్, హబ్సిగూడ డివిజన్‌లోని రాంరెడ్డినగర్‌లలోని బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మరికొన్నింటిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు.
వెంగల్‌రావు నగర్ డివిజన్‌లోని జవహార్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఉపసభాపతి పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కూడా తమతమ ప్రాంతాల్లోని దవాఖానాలను ప్రారంభించనున్నారు.
14 వేల మందికి వైద్య సేవలు...
బస్తీ దవాఖానాల ద్వారా రోజూ సుమారు 14 వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. నూతనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 17, మేడ్చల్‌లో 6, రంగారెడ్డిలో 2 ప్రారంభిస్తే మెుత్తం దవాఖానాల సంఖ్య 195 కు చేరనుంది. వీటితో అదనంగా మరో 2 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఒక్కో దవాఖానాలో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తారు. ఇవేకాకుండా నగరంలో 85 అర్బన్ హెల్త్ సెంటర్లు వైద్య సేవలందిస్తున్నాయి.
రానున్న రోజుల్లో మరిన్ని...
బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడంతోపాటు బీపీ, షుగర్‌తోపాటు 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి... 150 రకాల మందులను ఉచితంగా అందిస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్‌కు రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.