Bandi Sanjay Reaction On Brs: తెలంగాణ ప్రజలు తెరాసకు ఓటు వేస్తే దానిని బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్‌కు.. ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓట్లేసిన ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పేరు మార్చినట్లుగానే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. తెరాసను దివాళా తీసిన కంపెనీగా బండి సంజయ్ అభివర్ణించారు.
ఇప్పటి వరకు రాష్ట్రాన్ని దోచుకుని.. బీఆర్ఎస్ పేరుతో ఇక దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కుట్రపూరితంగానే జాతీయ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు ఎందరో టూరిస్టులుగా వస్తారని చెప్పి.. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ టూరిస్టుగా మారారని ఎద్దేవా చేశారు.
మహిళా వివక్ష గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరం: జాతీయ పార్టీలు ఏం చేస్తాయన్న వ్యక్తి ఇప్పడు జాతీయ పార్టీ ఎందుకు పెట్టారని బండి సంజయ్ నిలదీశారు. అవకాశవాదులు, రాజకీయ నిరుద్యోగులే కేసీఆర్‌తో ఉన్నారని ఆక్షేపించారు. ఐదేళ్లపాటు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేరని విమర్శించారు. సంవత్సరాల పాటు మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మహిళా వివక్ష గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరమని అన్నారు.
దళితబంధు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి: రాష్ట్రపతిగా ఎస్టీ మహిళ పోటీ చేస్తుంటే ఓటమికి యత్నించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 17.50 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం దళిత బంధు 8.4 లక్షల కుటుంబాలకు ఇచ్చిన్నట్లు గొప్పలు చెప్పారని ఆరోపించారు. దళితబంధు ఎందరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రకటించిన పార్టీకి జెండా లేదని బండి సంజయ్ విమర్శించారు.
తెరాస బండారం బయటపడుతుందనే భయం కేసీఆర్‌కు పట్టుకుంది: తెరాసను ప్రారంభించిన వారిలో ఇప్పుడెందరు పార్టీలో ఉన్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని పేర్కొన్నారు. తెరాస బండారం బయటపడుతుందనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని ఆరోపించారు. కుట్రలతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని యత్నిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
రాష్ట్రంలో కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలనేది కేసీఆర్ ఉద్దేశమని బండి సంజయ్ తెలిపారు. లిక్కర్ క్వీన్‌కు దిల్లీలో ఏదో విధంగా చేయూత ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణకు ఏం చేస్తారో.. తెలంగాణకు ఎంత ఆదాయం ఇస్తారో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
"నాకు తెలిసి సొంత విమానం కొన్నది ఇద్దరే.. ఒకరు కేఏ పాల్ మరొకరు కేసీఆర్. భవిష్యత్‌లో వీళ్లిద్దరికీ అలయెన్స్ ఉంటుందేమో. ఇక్కడ చెల్లని రూపాయి. కొత్తగా ప్రకటించిన పార్టీకి జెండా లేదు. పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదు.ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలి. తెరాస బండారం బయటపడుతుందనే భయం పట్టుకుంది. కుట్రలతోనే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని యత్నం. తెరాసను దివాళా తీసిన కంపెనీ. తెలంగాణలో తెరాసకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఓట్లు వేసి గెలిపించిన పార్టీకి వ్యతిరేకంగా భారాస పెట్టారు. మునుగోడులో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు." -బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: కేసీఆర్ BRSను స్వాగతిస్తున్నాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి