Praja Sangrama Yatra: పాతబస్తీ నుంచి తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తామంటే ఎవరూ నమ్మలేదని.. పాతబస్తీకి పోయి సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించామని... భాజపా ఎక్కడికైనా పోగలదని.. ప్రజల కోసం ఎంతకైనా తెగించగలదనే సంకేతాలను పంపామని ఆయన అన్నారు. ఆనాడు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందని... రాష్ట్ర శాఖ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను స్పూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని జాతీయ నాయకత్వం పేర్కొందంటే అది గర్వకారణమన్నారు.
ఈసారి కూడా అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతో చేపట్టే ఈ యాత్రతో తెలంగాణలో మరో చరిత్ర సృష్టిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో పాదయాత్ర ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు.
పాతబస్తీ సభతో సత్తా చాటాం. రెండో విడత పాదయాత్రతో చరిత్ర సృష్టిద్దాం. కేసీఆర్‌ను గద్దె దించడమే పాదయాత్ర లక్ష్యం. రాజ్యాంగం మార్చాలని అంబేడ్కర్‌ను కేసీఆర్ అవమానించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఆయన జయంతి రోజే రెండో విడత యాత్ర. తెలంగాణ ఉద్యమకారులు భాజపాలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తెరాస పాలనలో విసిగెత్తిన నేతలను ఏకతాటిపైకి తీసుకొద్దాం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు, పాదయాత్ర కమిటీ ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి బండారి శాంతి కుమార్, సహ ప్రముఖ్‌లు టి.వీరేందర్ గౌడ్, కుమ్మరి శంకర్, కార్యదర్శి కొల్లి మాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో జాతీయరహదారుల దిగ్బంధనం.. కేంద్రంపై తెరాస పోరాటం..