రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కరోనా దృష్ట్యా గతేడాది సామూహిక ప్రార్థనలు రద్దు చేసిన ప్రభుత్వం... ఈ సారి అనుమతిచ్చింది. దీంతో మసీదులు, ఈద్గాలను అందంగా అలంకరించి... అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బక్రీద్ ప్రార్థనల కోసం మక్కా మసీద్‌తో పాటు ఇతర కేంద్రాలకు ఉదయం నుంచే ముస్లింలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రార్థనల దృష్ట్యా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంక్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో పోలీసులు ఉదయం 11.30 వరకు ఆంక్షలు విధించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
అజాంపుర చుట్టీషా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ... ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, బక్రీద్ సందర్భంగా గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను ప్రత్యేక ప్రార్థనలతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.
హోంమంత్రి ప్రత్యేక ప్రార్థనలు
బక్రీద్ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అజంపూరలోని మసీద్‌లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం... ఆయనను కలిసిన ముస్లిం మత పెద్దలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పోలీసు అధికారులు హోంమంత్రిని కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాల్లో బక్రీద్ వేడుకలు
కరీంనగర్‌లో వర్షంలోనే ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. వరంగల్‌లోని బొక్కలగడ్డ ఈద్గా వద్దకు మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. బక్రీద్ విందు కోసం మేకలను బలివ్వటం ఆనవాయితీగా వస్తుండగా... మేకలు, గొర్రెలకు మార్కెట్లో భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
ఇదీ చదవండి: నిరాడంబరంగా బక్రీద్- కోవింద్, మోదీ శుభాకాంక్షలు