Rythu Bheema Application : రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 1 వరకు రాష్ట్ర వ్యవసాయశాఖ గడువు నిర్ణయించింది. ఈ పథకం కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులకు జీవిత బీమా కల్పించడానికి ప్రీమియం చెల్లిస్తుంది. గతేడాది (2021 ఆగస్టు 14- 2022 ఆగస్టు 13) ప్రీమియం కింద 35.64 లక్షల మంది రైతుల తరఫున రూ.1,465 కోట్లను భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)కి చెల్లించింది.
గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది (2022) జూన్ 22 వరకూ కొత్తగా భూములు కొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల వారు తమ భూమి ఉన్న గ్రామ ‘వ్యవసాయ విస్తరణ అధికారి’(ఏఈఓ)కి దరఖాస్తు ఇవ్వాలి. తద్వారా వారికి 2022 ఆగస్టు 14 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షలు జీవిత బీమా పరిహారం కింద ఎల్‌ఐసీ అందజేయాలనేది ఈ పథకం నిబంధన.