ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రేపు జరిగే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుని... కార్మికులను ఆదుకోవాలని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. డిపోల్లో అమాయకులను సీఎం సమావేశానికి పంపిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించాలని కోరారు. హైదరాబాద్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ... విపక్ష పార్టీలతో సమావేశమైంది. ఈ సమావేశంలో ఐకాస కో కన్వీనర్ రాజిరెడ్డి, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
సెక్షన్-19 కింద ఎవరైనా ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చునని... రాజ్యాంగం ప్రకారంగా కార్మిక సంఘాలు నడుస్తున్నాయని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇటీవల మరణించిన ముగ్గురు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పొన్నాల ఫౌండేషన్ నుంచి 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. వివిధ సంఘాలు.. బ్యాంకు అధికారులు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారన్నారు. సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక. కుల, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా పక్షపాతి: మల్లారెడ్డి