ఏపీ విశాఖ నగరవాసులకు రబ్బానీ ఎవరో తెలీదుగానీ, అతని కళాఖండాలు మాత్రం సుపరిచితమే. సుందరీకరణలో వాటి ప్రాధాన్యత అది మరి. విజయవాడకు చెందిన ఈ యువకుడు తండ్రి వ్యాపారం నిమిత్తం విశాఖ వలస వచ్చాడు. అక్కడే స్థిరపడ్డాడు. స్కెచ్‌లు వేయడమన్నా, చిత్రాలు ఆవిష్కరించడమన్నా ఎంతో ఇష్టం. ఆసక్తులు బాగున్నా.. ఇంటి ఆర్థికస్థితి బాగోలేక వివిధ నగరాల్లో జరిగే పోటీలకు కూడా వెళ్లేలేకపోయేవాడు. ఎప్పటికైనా ప్రపంచ కళాకారుడిగా మారాలని తపన మాత్రం అతనిలో ఉంది. ఆ తపనే జీవీఎంసీ 'కళాకారుడి'గా పేరుతెచ్చింది.
అవకాశాల పరుగులు
బీకాం చదివిన రబ్బానీ.. తన సోదరుడి సాయంతో లోగో డిజైనర్ జగన్నాథ్ బాబ్జీ దగ్గర పెన్సిల్ స్కెచ్‌లపై తర్ఫీదు పొందాడు. ఓ బిల్డర్ ఇచ్చిన అవకాశంతో నగరంలోని ప్రముఖ హోటళ్ల గోడలపై ఇతని పెయింటింగ్‌లు వాలిపోయాయి. ఓసారి రబ్బానీ కుటుంబం ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆ ఇల్లు గతంలో జీవీఎంసీ ఉద్యానశాఖ ఏడీ(ఏడీహెచ్)గా ఉన్న బలరాంకృష్ణది. యువకుడిలో కళలో జీవముందని గమనించిన ఆ ఆధికారి ఓ వినూత్న పనిని ఇతనికి అప్పగించారు.
ఆర్‌కేబీచ్, కురసురా మధ్య ఇసుక తెన్నెల్లో విద్యుత్ స్తంభాలకు దెబ్బతిన్న కళాఖండాల్ని బాగుచేసే పని అది. చేప, గొరిల్లా, బుద్ధుడి లాంటి ఆకృతుల నుంచి వచ్చే స్తంభాలన్నీ ఈయన రిపేర్ చేసినవే. ఆ పనుల్ని అవలీలగా చేయడంతో ఆ తర్వాత వచ్చిన ఏడీహెచ్ దామోదర్ ఇచ్చిన అవకాశాలు.. నగర రూపునే మార్చేశాయి. 2011 నుంచి 2018లోపు నగరంలోని సుమారు 15కు పైగా ప్రాంతాల్లో లక్ష చదరపు అడుగుల గోడలు రబ్బానీ వేసిన పెయింటింగ్‌లతో నిండిపోయాయి.
నలుదిశలా..
విశాఖలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా, వుడాపార్క్, పోలీస్ కమిషనర్‌బంగ్లా, పలు ప్రైవేటు సంస్థల్లో రబ్బానీ వినూత్న కళాఖండాలు కళ్ల ముందుకొచ్చాయి. పనితనం మెచ్చిన నేవీ అధికారులు.. చెన్నై, ముంబయి, అండమాన్ స్థావరాల్లోనూ పలు ఆకృతుల్ని చేయించుకున్నారు. తాజాగా విశాఖలో స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పలు కూడళ్లలో, రహదార్లలో పాత తుక్కుతో పలు ఆకృతుల్ని ఏర్పాటు చేసి మెప్పు పొందాడు. వీటిని చూసి కమిషనర్ సృజన ఆశ్చర్యపోయారని అంటాడు రబ్బానీ.
ఏ కళాఖండం వేయాలన్నా ముందు స్కెచ్ వేసుకుంటా. ఆ తర్వాత కంప్యూటర్‌లో డిజైన్ చేస్తా. ఎంత స్థలంలో ఎంతమేర ఆ కళాఖండం ఉండేదీ వివిధ సాఫ్ట్‌వేర్‌లతో ప్రణాళిక చేసుకుంటా. ఆశ్చర్యంతో అబ్బురపరచడమే నా లక్ష్యం. ఏదో ఒక రోజు పేదరికాన్ని అధిగమించి, ప్రపంచం మెచ్చే ఆర్టిస్ట్ అవుతాను
- మహమ్మద్ రబ్బానీ, ఆర్టిస్ట్
అబ్బా.. భలే చేప!
బీచ్‌రోడ్డులో ప్లాస్టిక్ బాటిళ్లతోనే చేసిన ఈ కళాఖండం రబ్బానీ చేసిందే. ఇందులో 10 వేల ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను వాడారు. తయారీకి 2 నెలలు పట్టింది. రెండుచేపల్లో పెద్దచేప 15 అడుగులు, చిన్నచేప 7అడుగుల మేర ఉంది.
చెంగుచెంగున కొంగలు
ఎన్‌ఏడీ కొత్తరోడ్డు దగ్గరున్న గ్రీన్‌బెల్ట్‌లో పక్షులు ఎగురుతున్నట్లు, జింకలు నడుస్తున్నట్లు.. ఇలా రకరకాల ఆకృతులున్నాయి. వాటిని పనికిరాని తుక్కుతో అందంగా చేశారు రబ్బానీ. పాత రేకులు, చైన్‌లు, గడ్డపార ముక్కలు తదితరాలతో తయారు చేశారు.
అచ్చు అమ్మాయిలాగే!
కుర్చీమీద రాజసంగా కూర్చుని అల్లికలేస్తున్న ఈ అమ్మాయి పెయింటింగ్ చూడగానే 'వావ్' అనేస్తారు. 2.5 అడుగుల పేపర్‌మీద వాటర్ కలర్స్‌తో ఈ చిత్రం పూర్తిచేయడానికి 6 నెలలు పట్టిందంటారు రబ్బానీ.
చిరుత ఉంది జాగ్రత్త
బీచ్‌రోడ్డులోని ఓ ఇంట్లోని గోడకు వేసిన 3డీ చిరుత చిత్రమిది. ఎంచక్కా చిరుతనే కూర్చుని ఇలా కొంటెగా చూస్తోందా అనే భావన కలిగిస్తోంది కదూ. అది మరీ రబ్బానీ ప్రతిభ అంటే.
ఇదీ చదవండి: పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి