Former IAS PV Ramesh: హైదరాబాద్‌లోని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ ఇంటికి రాష్ట్ర పోలీసులు వెళ్లారు. పోలీసులు తన ఇంటికి వెళ్లటంపై పీవీ రమేశ్ విస్మయం వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లో లేనన్న మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్.. తన ఇంటికి పోలీసులు ఎందుకెళ్లారో తెలియదన్నారు. గతంలో పీవీ రమేశ్ ఏపీ సీఎం జగన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
ప్రభుత్వం వివరణ..
విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సీమెన్స్ కేసులో సమాచార సేకరణకు రమేశ్ ఇంటికి డీఎస్పీ వెళ్లినట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో పీవీ రమేశ్ ఇంట్లో ఎవరూ లేరని.., ఆయన ఇల్లు మారినట్లు తెలిసిందన్నారు. కొత్త చిరునామాకు స్పీడ్‌పోస్ట్‌లో ప్రశ్నావళి పంపుతున్నట్లు వెల్లడించింది. దర్యాప్తునకు కావాల్సిన సమాచార సేకరణ ప్రయత్నంలో భాగంగానే పీవీ ఇంటికి వెళ్లినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీమెన్స్ కేసు నేపథ్యం ఏంటంటే..
CID Filed Case On Siemens: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై రాష్ట్ర సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్‌తో పాటు పుణెకు చెందిన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయికి చెందిన స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితర 26 మందిని నిందితులుగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌విత్ 120బీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(సీ) (డీ) సెక్షన్ల ప్రకారం ఈ కేసు పెట్టింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
ఈ ప్రాజెక్టులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైనందున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఐడీని కోరుతూ ఈ ఏడాది జులై 11న నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మెమో జారీచేశారు. వాటి ఆధారంగా ఈ నెల 9న కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీ ఎం.ధనుంజయుడిని దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నుంచి జులై 7న అందిన నివేదిక, ఈ నెల 9న అందిన సీఐడీ ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది.
ఇదీ చదవండి:
Ministers and MPs Delhi Tour: రాష్ట్ర మంత్రులకు ఇంకా లభించని పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్