హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన విప్పెన్ అగర్వాల్ 2010 నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారు. 2016లో ప్రతివాద సంస్థలో మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నారు. అనంతరం నెలరోజుల వ్యవధిలో బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ... ఒబెసిటీ కారణంగా ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకోలేదు.
అనంతరం 18 నెలలు గడిచిన తర్వాత విరేచనాలు, న్యూసియా, బీపీ తగ్గిపోవడం తదితర లక్షణాలు ఉండి నీరసంతో కింద పడిపోవడంతో విప్పెన్ తలకి గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరిశీలించిన వైద్యులు ‘ఆక్యూట్ గ్యాస్ట్రో ఎంటెరిటిస్గా నిర్ధారించగా.. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు మెడిక్లెయిమ్ కోసం ప్రయత్నించగా ఒబెసిటీ ఉన్న విషయాన్ని పొందుపరచలేదని బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్.ఎస్.రాజేశ్రీతో కూడిన బెంచ్ బీమా సంస్థ తీరును తప్పు పట్టింది.
గ్యాస్ట్రో ఎంటెరిటిస్ అంటే జీర్ణకోశం, పేగులకు సంబంధించిన వ్యాధి అని వివరించింది. వైరస్, బ్యాక్టిరియా, పారసైట్, ఫంగస్‌లు కారణంగా ఈ లక్షణాలు ఉంటాయని ఉదరకోశంలో నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయని పేర్కొంది. ఊబకాయంతో ఉండేవారు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చికిత్సకు అయిన ఖర్చు మొత్తం చెల్లించడంతో పాటు పరిహారం, కేసు ఖర్చులు చెల్లించాలని తీర్పు వెలువరించింది. వైద్య చికిత్సలకు అయిన ఖర్చు మొత్తం 6 శాతం వడ్డీతో రూ.78,305.77, రూ.25 వేలు పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేలు, 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: 'గడువులోగా ఫ్లాటు అప్పగించకపోవడం సేవా లోపమే'