Air pollution in Hyderabad city : గాలి కాలుష్యం నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. లక్షల వాహనాల రాకపోకలు.. పెరుగుతున్న చలి కారణంగా కాలుష్యం ప్రమాదస్థాయికి చేరింది. వారాంతంలో పరిస్థితి తీవ్రంగా మారింది. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మలక్‌పేట, జూపార్క్, సనత్‌నగర్, సోమాజిగూడ.. ఇలా నగరం నలుమూలల్లోనూ గాలినాణ్యత పడిపోయింది. అత్యధిక గాలి కాలుష్యం మలక్‌పేట, సనత్‌నగర్‌లో నమోదయ్యింది.
రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోనున్న దృష్ట్యా మరింత కాలుష్యం పెరుగనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశ రాజధానిలో ఊపిరి పీల్చుకోలేని దుస్థితి నెలకొంది. వారం రోజుల కిందట అక్కడ గాలినాణ్యత సూచిలో కాలుష్యస్థాయి 374 పాయింట్లు నమోదయ్యింది. కోటికిపైగా జనాభా ఉన్న మెట్రోనగరాల విభాగంలో ముంబయి (205) రెండో స్థానం, హైదరాబాద్ (127) మూడోస్థానంలో నిలిచాయి.
కాలుష్యం తగ్గించేందుకు.. నగరంలో వాయు, జల, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాచరణ రూపొందించనుందని పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యానికి ముఖ్య కారణాలు.. నియంత్రణ చర్యలు.. తదితర అంశాలపై ఐఐటీ కాన్పూర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను సచివాలయంలో పరిశీలించారు.
గాల్లో కలుస్తున్న కాలుష్యాన్ని లెక్కగట్టేందుకు రెండు చదరపు కిలోమీటర్ల గ్రిడ్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఆయా గ్రిడ్‌లలో ఎక్కడ కాలుష్యం ఎక్కువగా వస్తుందో తెలుసుకొని నియంత్రణ చర్యలు చేపట్టనున్నామని డాక్టర్ రజత్‌కుమార్ తెలిపారు. వివిధ అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌కు అందజేశారు.