15 Lakhs stolen in the name of Donation in Hyderabad : 'స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్లు విరాళం ఇచ్చేందుకు దాత సిద్ధంగా ఉన్నాడు. హైదరాబాద్ వస్తే ఆయనతో మాట్లాడి అక్కడికక్కడే పదికోట్ల విరాళం ఇప్పిస్తాం. ఇది జరగాలంటే రూ.15లక్షలు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందంటూ.. నమ్మించాడు ఓ మోసకారి. చర్చల కోసం స్టార్ హోటల్లో గది బుక్ చేసి సినీ ఫక్కీలో రూ.15లక్షలను కాజేసి జారుకున్నాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
15 lakhs looted in hyderabad : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన నిజాంపట్నం అమరేంద్ర (47) ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ హెల్త్ సొసైటీ ట్రస్ట్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే అమరేంద్రకు ఇటీవల వెంకటేశ్వర రావు, శ్రీనివాసరావు అనే వ్యక్తుల ద్వారా భరత్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన అనేక మంది దాతలు పలు స్వచ్ఛంద సంస్థలకు కోట్లాది రూపాయలు విరాళాలుగా ఇస్తుంటారని భరత్‌రెడ్డి నమ్మ బలికాడు. ఒక అజ్ఞాత దాత రూ.10కోట్ల విరాళాన్ని రూరల్ డెవలప్మెంట్ హెల్త్ సొసైటీ ట్రస్టుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అమరేంద్రకు చెప్పాడు. ఈ మొత్తాన్ని ఇప్పించాలంటే తనకు రూ.15 లక్షలు కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని భరత్ రెడ్డి చెప్పాడు.
డీల్ తర్వాతే కమీషన్ : ఈనెల 25న బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు వస్తే అక్కడే డీల్ కుదిరిస్తానని భరత్ రెడ్డి చెప్పాడు. దీంతో పాటు అక్కడే ఓ గది బుక్ చేశాడు. అక్కడికి చేరుకున్న అమరేంద్రను కలిసిన భరత్ రెడ్డితో పాటు అతడితో వచ్చిన నాగరాజును రూమ్ నం.422లోకి తీసుకువెళ్లారు. రూ.10 కోట్ల విరాళం ఇచ్చే దాతతో చర్చలు జరుగుతున్నాయని, రూ.15లక్షల కమీషన్ మొత్తాన్ని లాకర్లో పెట్టాలని, తనవద్ద ఉన్న మరో రూ.15 లక్షలు కూడా అదే లాకర్లో పెట్టి సీక్రెట్ కోడ్ ద్వారా లాక్ చేద్దామని సూచించాడు. డీల్ కుదిరిన తర్వాతనే ఇద్దరం కలిసి లాకర్ ఓపెన్ చేద్దామని నిర్ణయించుకున్నారు.
సీక్రెట్ కోడ్ పేరుతో తనను మోసం : చర్చల కోసం తాను బయటకు వెళ్తున్నానని, నాగరాజు అదే గదిలో ఉంటాడని చెప్పి భరత్ రెడ్డి బయటకు వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం నాగరాజు కూడా పని ఉందంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన అమరేంద్ర పార్క్ హయత్ హోటల్ యాజమాన్యం సాయంతో లాకర్ ఓపెన్ చేసి చూడగా.. తాను పెట్టిన రూ.15లక్షలతో పాటు భరత్ రెడ్డికి చెందిన రూ.15లక్షలు కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా సీక్రెట్ కోడ్ పేరుతో తనను మోసం చేయడంతో పాటు డబ్బులతో ఉడాయించారని గుర్తించిన అమరేంద్ర శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భరత్ రెడ్డి, నాగరాజుల మీద ఐపీసీ 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్క్ హయత్ సీసీ పుటేజీలు పరిశీలించగా.. డబ్బుతో ఉన్న బ్యాగును తీసుకుని నాగరాజు బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇవీ చదవండి: