కార్గిల్ సమీపంలోని గల్వాన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వర్తిస్తున సమయంలో బాంబు పేలి అమరుడైన లాంచ్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు(37) అంత్యక్రియలు బుధవారం స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నగరంలో అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
పదిహేడున్నరేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకొని నాలుగోసారి యుద్ధభూమిలో కాలుపెట్టిన సిక్కోలు ముద్దుబిడ్ద లావేటి ఉమామహేశ్వరరావు కార్గిల్ సమీపంలో శత్రు దేశాలు దాచి పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తూ శనివారం అమరజీవుడయ్యాడు.
ముందురోజు వీడియోకాల్‌లో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలని ఆ కుటుంబ సభ్యులకు అప్పుడు తెలియలేదు. ఇంటిల్లపాది సంతోషంగా ఉన్న సమయంలో కార్గిల్ రెజిమెంట్ సైనికాధికారులు మరణ వార్తను మృతుని అక్క సుబ్బలక్ష్మికి చరవాణి ద్వారా తెలియజేశారు.
దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ద్రిగ్భాంతికి గురయ్యారు. అందరితో సన్నిహితంగా ఉండే ఉమ ఇకలేడని హడ్కో కాలనీ ప్రజలు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
నువ్వు ఏడవద్దు.. నాన్న డ్యూటీకి వెళ్లారు
దేశ సేవలో వీరమరణం పొందిన తన తండ్రి ఇకలేడని 11 ఏళ్ల పెద్ద కుమార్తె వైష్ణవి ప్రియ ఒకవైపు విలపిస్తుంటే.. 'నువ్వు ఏడవద్దు.. నాన్న డ్యూటీకి వెళ్లారు ఇప్పుడే రారు'...అంటూ ఉమామహేశ్వరరావు నాలుగేళ్ల కుమార్తె పరిణిత చెప్పే మాటలు కుటుంబీకులను, బంధువులు, స్నేహితులను కంటతడి పెట్టించాయి.
కుమార్తెలను పట్టుకొని ఆ తల్లి బోరున విలపించే సంఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.
రెండేళ్లలో వస్తానని...ఇంతలోనే తిరిగిరాని లోకాలకు
తనతో బాధ్యతలు స్వీకరించిన సహచరులు ఈ ఏడాది ఉద్యోగ విరమణ చెందినా...యూనిఫాంపై మక్కువతో దేశానికి సేవ చేయాలనే ఆశతో బాంబ్ డిస్పోజల్ కోర్స్ పూరి ్తచేసి మరో రెండున్నరేళ్లు సర్వీసును పెంచుకున్నారు.
ఆ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతాను. పిల్లలను చూసుకుంటాను అని స్నేహితులకు, బంధువులకు చెప్పి ఫిబ్రవరి 23న జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. ఇంతలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వారంతా బోరున విలపిస్తున్నారు.
జీతం కోసం కాదు.. దేశం కోసం
పదిహేడున్నరేళ్లు ఆర్మీలో పని చేశారు. ఇక చాలు ఇంటికి వచ్చేయమని మేము అడిగితే నేను జీతం కోసం కాదు.. దేశం కోసం పనిచేస్తున్నాను..అని గర్వంగా చెప్పేవారు. వీర మరణం పొందిన జవాన్లను చూసి ఏ జవాన్‌కైనా దేశ రక్షణలో చనిపోవడమే అదృష్టం అని చెప్పేవారు - లావేటి నిరోషా, మృతుని భార్య
నివాళులర్పించిన త్రివిధ దళాలు
జమ్మూకశ్మీర్ నుంచి విశాఖపట్నం చేరిన ఉమామహేశ్వరరావు భౌతికకాయంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచి త్రివిధ దళాధికారులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని జవాన్ కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చూడండి: ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష