కరోనా విపత్తుతో తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి, భవిష్యత్తుపై అభద్రత భావంతో ఉన్నారని, ఈ సమయంలోనే స్వీయ రక్షణ చర్యలతో విపత్తును ఎదుర్కోవాలని తెలిపింది. ఆరేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యం, భద్రత, వారు వేగంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యునిసెఫ్ ‘దేశంలో బాల్యం ఎదుగుదల’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ‘‘కరోనా విపత్తు తల్లిదండ్రులు, పిల్లలకు కొత్త సవాళ్లు తీసుకొచ్చింది. వైరస్ భయంతో చిన్నారులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రీస్కూళ్లు, పాఠశాలలు మూసివేయడంతో వారి దైనందిన జీవనం మారిపోయింది.
పిల్లల కదలికలపై తీవ్ర నియంత్రణలు వచ్చాయి. ఈ సమయంలో పిల్లల పట్ల సానుకూల వైఖరి, సరైన పర్యవేక్షణ లేకుంటే వారు భావోద్వేగ, మానసిక సమస్యలతో బాధపడే అవకాశముంది. తల్లిదండ్రులు పిల్లలకు కరోనాపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో చెబుతూ వారిని వైరస్‌పై పోరాడేలా సంసిద్ధులను చేయాలి’’ అని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది. వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడుపుతూ ఒంటరి తనాన్ని దూరం చేయాలని మార్గదర్శనం చేసింది. ఐదు అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది.
1. ఆరోగ్యం
పిల్లల ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. పరిశుభ్రత పాటిస్తూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవాలి. జబ్బుపడిన వెంటనే సరైన చికిత్స ఇప్పించాలి.
2. పోషకాలు
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన పోషకాలు ఇవ్వాలి. గర్భిణులు తీసుకునే పోషకాలు ఆమె ఆరోగ్యంతోపాటు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయనే అంశాన్ని మర్చిపోవద్దు.
3. భద్రత, రక్షణ
ఓ వ్యతిరేక అనుభవం పిల్లల్లో భయం, మానసిక ఆందోళన పెంచుతుంది. ఈ సమయంలో పిల్లలు హింస, వేధింపులకు గురికాకుండా చూడాలి.
4. ఆహారం.. సామాజిక సంబంధాలు
పిల్లలను స్వేచ్ఛగా ఎదగనిచ్చినప్పుడే సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. ఆ అవకాశాన్ని వారికి ఇవ్వడంతోపాటు నిరంతర సంభాషణకు వీలు కల్పించాలి.
5. నేర్చుకోవడం
సంరక్షకులతో నిరంతర అనుబంధం, అనుకూల వాతావరణం పిల్లలు వేగంగా ఎదిగేందుకు, త్వరగా నేర్చుకునేందుకు దోహదం చేస్తాయి. ఆడుకోవడం, నవ్వడం, కంటిచూపుతో అనుసంధానం, మాట్లాడటం, పాటలు పాడటం, అనుకరణ, అలంకరణ తదితరాలు నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తాయి. అవన్నీ పిల్లలకు దూరం కాకుండా చూడాలి. పిల్లలతో గడిపే సమయాన్ని తల్లిదండ్రులు పెంచాలి.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా