త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు 2016 ఎన్నికలనాటి రిజర్వేషన్లను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న సమయం సమీపించడంతో సర్కారు ఆ దిశగా అడుగులేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. కొత్త రిజర్వేషన్లను నిర్ణయించాలంటే 25 రోజుల నుంచి నెల రోజులు పడుతుందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు గుర్తుచేస్తోంది. తదనుగుణంగా ఎన్నికల విభాగం ఏర్పాట్లలో వేగం పెంచింది.
ఇదే సరైన సమయం..!
జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 2020తో ముగియనుంది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టం ప్రకారం ఆ తేదీకి 3 నెలల ముందు లేదా 6 నెలల తర్వాతి కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్ఛు. పైవంతెనలు, అండర్‌పాస్‌లను వరుసగా ప్రారంభించడం, పదుల సంఖ్యలో లింకు రోడ్లు నిర్మాణమవడం, ఇతరత్రా అభివృద్ధి పనులు ప్రజలకు చేరువ అయినందున తమకు సానుకూల వాతావరణం ఉందనుకున్న అధికార పార్టీ ముందే ఎన్నికలకు సమాయత్తమైంది.
నవంబరులో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, డిసెంబరులో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అనుకున్నట్లు జరగాలంటే పాత రిజర్వేషన్లను అమలుచేయడం ఉత్తమమని భావిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అందుకుగాను ఒకసారి నిర్ణయించిన రిజర్వేషన్లను వరుసగా రెండు ఎన్నికల్లో ఉపయోగించేందుకు అనుమతించే కొత్త మున్సిపల్ చట్టాన్ని, జీహెచ్‌ఎంసీలో అమలు చేసేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండిః తీగల వంతెనపై ఆంక్షలు... అతిక్రమిస్తే చర్యలే