Vaddera Basti incident : హైదరాబాద్ మాదాపూర్ వడ్డెర బస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో కొత్తగా 13 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మొత్తం కలుషిత నీటి బాధితుల సంఖ్య 89కి చేరింది. ఆసుపత్రిలో 58 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కిడ్నీ సంబంధిత క్రియాటిన్ లెవల్ పెరగడంతో ఐదుగురిని ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న 26 మందిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థత గురైన విషయం తెలిసిందే. బాధితుల సంఖ్య రోజురోజుకుపెరుగుతోంది. మొదట 57 మంది అస్వస్థకు గురికాగా మరో 19మందితో కలిపి ఆ సంఖ్య 76కు చేరుకుంది. నిన్న రాత్రి దాదాపు 13 మంది వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో వారి సంఖ్య 89కి చేరింది.
ఇదీ చదవండి: వడ్డెర బస్తీ ఘటనలో 76కి చేరిన బాధితుల సంఖ్య