ఇంట్లో ప్రతిచిన్నదానికి తాళం వేసి జాగ్రత్తగా చూసుకుంటాం. సైకిల్ నుంచి ఏ వాహనానికైనా తాళం వేసుకునే సదుపాయం ఉంటుంది. కానీ తెలంగాణ ఆర్టీసీలో 80శాతం బస్సులకు తాళం లేదు, తాళం చెవి లేదు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా... అక్షరాల వందశాతం నిజం. ప్రతి రోజూ 10వేల 512 బస్సులు 9వేల 377 గ్రామాల మీదుగా దాదాపు 35 లక్షల 96వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ... 97 లక్షల 53వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు, 1,124 బస్ స్టేషన్లు ఉన్నాయి. చాలా వరకు బస్సులను రాత్రి వేళ బస్టాండ్లలోనే నిలిపి వేస్తారు. గౌలిగూడ బస్టాండ్‌లో నిలిపిన 3డి రూట్ నంబర్ సిటీ బస్సు తెల్లారేసరికి చోరీకి గురైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే... బస్సు స్టీరింగ్‌కు తాళం వేయడమే పరిష్కారంగా చెబుతున్నారు.
రాష్ట్రంలో 80శాతం ఆర్టీసీ బస్సులకు తాళం లేదు, తాళం చెవిలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో 3 వేల 700 బస్సులు ఉండగా... వాటిలో కీ సిస్టం ఉన్నవి కేవలం 500 మాత్రమేనని డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇటీవల చోరీకి గురైన బస్సుకు కూడా తాళం లేకపోవడం వల్లనే జరిగిందని తెలిపారు. ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టం ఉంటే... తాళం చెవితో స్టీరింగ్‌కు కూడా లాక్ వేయడం వల్ల బస్సు భద్రంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న బస్సులు కేవలం బటన్ నొక్కితే చాలు స్టార్ట్ అవుతాయి, వైరు వెనక్కి లాగితే ఆగిపోతాయి. ఇలాంటి వాటిని సునాయసంగా ఎత్తుకెళ్లవచ్చని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. బస్సులు హాల్టింగ్ ఉండే స్టేషన్లలో భద్రత పెంచి, సీసీ కెమెరాల నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు.
ఇవీ చూడండి: నేడు ఇంటర్ బోర్డు ముట్టడి, నిరవధిక నిరాహార దీక్ష