దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసన్నారు. కార్యకర్తల అభీష్ఠం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని చెప్పారు. తన కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.
''గడిచిన 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏం చేసింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి. నా కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. కార్యకర్తల అభీష్ఠం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటా.'' - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ
ఆదివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పొంగులేటితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పొంగులేటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ.. పలువురిపై పార్టీ ఆయా మండలాల నాయకులు బహిష్కరణ వేటు వేశారు. దాదాపు 20 మందిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బహిష్కరణ వేటు..: ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. కొన్ని నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి అతను బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై బీఆర్ఎస్ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది.
వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్‌ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్‌తో పాటు 18 మందిని సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, బీఆర్ఎస్ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి.. పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.
ఇవీ చూడండి..