భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎనిమిదో రోజైన నేడు బలరామ అవతారంలో కనువిందు చేశారు.
బలరామ అవతారంలో ఉన్న స్వామి వారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన వైదిక పెద్దలు అధ్యయనోత్సవం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామి వారు చిత్రకూట మండపంలో భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీహరికి ప్రీతికరమైన ఆదిశేషుని అంశతో జన్మించి 'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్నదానికి ప్రతీకగా స్వామివారు నాగలిని ఆయుధంగా ధరించాడని అర్చకులు చెబుతున్నారు. కృష్ణునికి అండగా నిలిచి ధర్మస్థాపన సహకరించిన అవతారం బలరామ అవతారమని వేద పండితులు తెలుపుతున్నారు. మహావిష్ణువు ఈ అవతారంలో ప్రలంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడని.. స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు.
ఇదీ చూడండి: 'కేంద్ర నిధులతో రాష్ట్ర పథకాలు అమలు చేయమంటే ఎలా'