భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భౌతిక దూరం పాటించకుండా సరుకుల కోసం ఎగబడటం అధికారులకు సవాల్‌గా మారింది.
పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావడం మంచి పరిణామమే అయినా.. లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడే నిబంధనలను బేఖాతరు చేస్తే ఎలాగని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడ్డారని పలు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.