జనంలో కరోనా భయం తోడు ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. విధిలేని పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం ఐసోలేషన్ వార్డు కూడా లేదే? అన్న ప్రశ్న మదినితొలుస్తోంది.. ఇల్లెందువాసులు ఖమ్మం, కొత్తగూడెం ఎటువైపు వెళ్లాలన్నా.. అరగంటకుపైగా ప్రయాణించాల్సి రావడం గమనించాల్సిన అంశం.
ఇవీ సమస్యలు
- జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట తదితర ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తూనే, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కానీ ఇల్లెందులోని 30 పడకల ఆసుపత్రిలో ఐసోలేషన్ వసతి లేదు.
- ఏదైన రోగికి ఐసోలేషన్ సౌకర్యం కావాలంటే ఖమ్మం, లేనిపక్షంలో కొత్తగూడెం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇదీ రోగులకు, వారి కుటుంబాలకు మరింత ఆర్థికభారం అవుతోంది.
- ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వైద్య సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నాయి.
- యూఎఫ్‌డబ్ల్యూసీ(అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్) విభాగానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది లేకపోవడంతో కరోనా సోకిన వారికి సకాలంలో వైద్య చికిత్సలు, నిరంతరం పరిశీలన సకాలంలో జరగడం లేదు.
- ఫ్యామిలీ వెల్ఫేర్ వర్కర్‌కు సంబంధించి ఒక ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉంది.
- రొంపేడు పీహెచ్‌సీ నుంచి ఇద్దరు ఒప్పంద విభాగానికి సంబంధించిన ఏఎన్‌ఎంలు డిప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి.
- సుమారు 22 మంది ఆశావర్కర్లు ఉండాల్సి ఉండగా కేవలం 11 మందితోనే వైద్య పరీక్షలు
- ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం కారణంగా కొవిడ్ బాధితులకు సకాలంలో చికిత్సలు, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడం, సలహాలు, సూచనల కార్యాచరణపై ప్రభావం చూపుతోంది.
పేరు: ఇల్లెందు 30 పడకల ఆసుపత్రి
నిత్యం ఓపీ: 400 నుంచి 500
వచ్చే రోగులు: ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, కారేపల్లి మండలాలు
ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తోంది. అదేవిధంగా సిబ్బంది కొరతతో కొంతమందిపై భారం పడుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం.
-ప్రభుత్వ వైద్యాధికారి వరుణ్