భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పురపాలక శాఖ పెంచిన ఆస్తి పన్నులపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మరోసారి పరిశీలిస్తామని పురపాలక ప్రత్యేకాధికారి శ్రీరామ్ తెలిపారు. పురపాలక కార్యాలయానికి వచ్చిన ఆయన్ను అఖిలపక్ష పార్టీల నాయకులు కలిశారు. పెరిగిన ఆస్తి పన్నులు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. ఆస్తి పన్నులు.. పరిమితికి మించి విధించినట్టు ఫిర్యాదులొచ్చాయని, విచారిస్తున్నామని తెలిపారు.
మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంత మేరకు ఆస్తిపన్ను పెరిగిందో, ఎంత విధించారో తెలపాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం పురపాలక కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీను ఆయన పరిశీలించారు.