భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు మండలం బోజ్యా తండాలో 350 మంది వలస కూలీలకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కిరణా సామగ్రి పంపిణీ చేశారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కూలీలకు సరకుల వితరణ చేశారు. భారీగా తరలివచ్చిన కూలీలకు భౌతిక దూరం పాటింపజేస్తూనే సరకులు అందించారు.
ప్రభుత్వం వలస కూలీలకు, పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటుందన్నారు. దాతలు సైతం కొండంత అండగా భరోసగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూలీలు లాక్ డౌన్ ముగిసే వరకు సంయమనం పాటించాలని కోరారు. తమ ప్రాంతాల్లోనే ఉండాలని, ఎటు వెళ్లొద్దని సూచించారు. వైద్య సౌకర్యం, ఇతర వసతులు అధికారులు కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.