భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ఇద్దరు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ సభ్యులను అరెస్టు చేసినట్లు గుండాల సీఐ శ్రీనివాస్ తెలిపారు. గుండాల మండలం శివారులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారిని ఇల్లందు మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన మోకాల రమేశ్, గుండాల మండలం బాటన్నగర్ గ్రామానికి చెందిన మడవి మహేశ్‌గా గుర్తించారమని చెప్పారు.
2019 జులై 31న పోలీసులకు న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీసులపై వారు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఆ సమయంలో వీరిద్దరు తప్పించుకున్నారని తెలిపారు. వీరు తుపాకులతో బెదిరిస్తూ చందాలు వసూలు చేస్తున్నారని చెప్పారు. బుధవారం గుండాల మండలంలోని వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి చందాలు వసూలు చేయడానికి వస్తున్న క్రమంలో వారిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరి నుంచి 25 రౌండ్ల తూటాలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!