భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సుమారు 70 వేలకు మందికి పైగా జనాభా ఉన్నారు. వీరందరికీ నిత్యం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా అందించే తాగునీరే ఆధారం. కొళాయి ద్వారా వస్తున్న నీరు కలుషితం అవుతోందని వారికి తెలియదు. అది మురుగు మిళితమైన గరళజలం అని.. అధికారులకు తెలిసినా మురుగు నీటినే సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
వాటర్ ట్యాంక్ పరిసరాల్లోనే..
భద్రాచలం పట్టణ వాసుల తాగునీటి అవసరాల కోసం గోదావరి బ్రిడ్జి వద్ద వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. గోదావరి నది నుంచి నీటిని తీసుకుని శుద్ధిచేసి సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు సమస్య అక్కడే ఉంది. ఈ వాటర్ సమీపంలోనే మురుగు కాలువ వచ్చి గోదావరిలో కలుస్తుంది. పట్టణంలోని ఆర్టీసీ కాలనీ సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృథానీరు వాటర్ ట్యాంక్ పంప్‌హౌస్ పరిసరాల్లో కలుస్తుంది. నది ప్రవాహం ఉన్నప్పుడైతే... మురుగు పారుతుంది. కానీ వేసవిలో నది ప్రవాహం ఆగిపోయినప్పుడు ఈ మురుగు నీరే ట్యాంకులోకి వెళ్తుంది. ఈ జలాన్నే అధికారులు పట్టణవాసులకు సరఫరా చేస్తున్నారు. మురుగు కలుస్తుంది అది తెలిసిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ గోదావరి ఉన్నా కలుషిత జలమే తాగుతున్నాం. దీనివల్ల ఎంతో మందికి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. మరుగు నీరు కలిసే చోట వాటర్ ట్యాంక్ ఉండి.. ఆ మురుగే సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజలంతా స్వచ్ఛమైన నీటినే తాగుతున్నామనుకుంటున్నారు. కానీ వారికి తెలియదు అన్ని జబ్బులకు మూలమైన నీటిని తాగుతున్నామని.. బాల నర్సారెడ్డి, స్థానికుడు.
మురుగునీరు తాగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గోదావరి ఉన్నా మురుగు నీరు తాగుతున్నాం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. గడ్డం స్వామి, స్థానికుడు.
స్పందించని అధికారులు..
ఈ విషయాన్ని ఈటీవీ బృందం... ప్రజాప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భద్రాద్రి పట్టణ వాసులు భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయం..
ఆ పరిస్థితి అవసరమా..
పక్క రాష్ట్రంలో నీటి కలుషితమై వింత వ్యాధి వచ్చిందంటే అయ్యో అనుకున్నాం... పట్టణం నుంచి వెళ్లిన మురుగు నీరే తిరిగి తాగుతున్నామని తెలుసుకోలేకున్నాం... ఇది ఇలాగే కొనసాగితే మన పరిస్థితి చూసి అందరూ అయ్యో...! అనుకున్నా ఏమీ చెయ్యలేం.. ఆ పరిస్థితి రాకుండా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజల అభిప్రాయం.
ఇదీ చూడండి: సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!