భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం చివరి 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60.5 అడుగులు దాటింది. వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు.
సంబంధాలు నిలిచిపోయాయి
గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలంలోని కల్యాణ కట్ట, స్నాన ఘట్టాలు, శ్మాశాన వాటిక దిగువన ఉన్న విస్టా కాంప్లెక్స్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ వరద నీటిలో మునిగిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద గల తూర్పు మెట్లకు వరద పోటెత్తింది. అన్నదాన సత్రం వరద నీటిలో మునిగిపోయింది. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వరద నీరు రావడం వల్ల ఏజెన్సీ మండలాలకు విలీన మండలాలకు పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి. జిల్లాలోని పాల్వంచ వద్దగల నాగారం వంతెనపై గండి పడటం వల్ల భద్రాచలం నుంచి ఖమ్మంకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపివేశారు.
వరద ప్రవాహంలో గ్రామాలు
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం నుంచి ఇంకా భారీ ఎత్తున నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రాంతమైన పేరూరులో వరద నీరు ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెంలో ముంపునకు గురైన కాలనీల ప్రజలను అధికారులు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద నీరు పెరగడం వల్ల భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది.
రాష్ట్ర విభజనలో భద్రాచలం నుంచి విడిపోయిన చింతూరు కూనవరం, వీఆర్.పురం మండలాల్లో రెండు రోజుల నుంచి విద్యుత్తు నిలిపివేశారు. ఆయా మండలాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీఆర్.పురం మండలంలోని వడ్డిగూడెం, చింతరేవు పల్లి, రాజుపేట, ధర్మ తాళ్లగూడెం, శ్రీరామగిరి, సీతంపేట, ములకలపల్లి, జీడిగొప్ప గ్రామాలు వరద ప్రవాహంలో చిక్కుకున్నాయి. చింతూరు కూనవరం మండలాల్లో చాలా గ్రామాలు వరద నీటి ప్రవాహంలోనే ఉన్నాయి.
ఇదీ చూడండి : ఎడతెరిపి లేని వర్షాలు... జలమయమవుతున్న జిల్లాలు