వర్షాలు, భారీగా వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన గోదావరితో పాటు ప్రాణహిత, శబరి, సీలేరు ఉప నదుల నుంచి గోదావరికి వరద పోటెత్తింది. భారీ వర్షాలకు వరంగల్‌లో వందకుపైగా కాలనీలు, భద్రాచలంలోనూ లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గోదావరి ఉగ్రరూపంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి.
గోదావరికి 1986 ఆగస్టు 16న అత్యధికంగా వరద వచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గణాంకాల ప్రకారం ఆ రోజు 30.81 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 1990లో 21.83 లక్షల క్యూసెక్కులు రాగా, 2006లో 18.67 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేంద్ర జల సంఘం బులెటిన్ ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు 18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు 18.71 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అంచనా. కేంద్ర జల సంఘం గేజ్ పాయింటు పోలవరం డ్యాం దిగువన మూడు కిలోమీటర్ల వద్ద ఉంది. ఈ గేజ్ పాయింటు ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు 19.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైనట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. మంగళవారం నాటికి ఇది 21 లక్షల నుంచి 22 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి 2,3 రోజులు ప్రవాహం మరింత పెరిగి ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్‌డ్యాం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు 30.50 మీటర్లకు వరద పెరిగింది. అటు ఎగువ కాఫర్‌డ్యాం, ఇటు స్పిల్‌వే ద్వారా వరద దిగువకు వెళుతోంది. పోలవరం గ్రామం వద్ద సాయంత్రానికి 15.25 మీటర్లకు వరద పెరిగింది. గంటకు 2-3 సెం.మీ.చొప్పున వరద ముప్పు పెరుగుతోంది.
ఇదీ చూడండి: వరదలపై జాతీయ వ్యూహం అవసరం!