వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీలో తెలంగాణ అటవీ అధికారులు రెండు అవార్డులు గెలుచుకున్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు జరిగాయి. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్‌రావు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫొటో ఉత్తమ రెండో చిత్రంగా నిలిచింది.

జన్నారం డివిజనల్ అధికారి సిరిపురం మాధవరావు కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతికి చెందిన గద్ద(క్రెస్టెడ్ హాక్ ఈగల్) ఫొటోకు మూడో స్థానం దక్కింది. ఈ ఇద్దరు అధికారులను రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ అభినందించారు.
