Revanth Reddy Fires on CM KCR : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యతతో కూడిన విద్యుత్ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. అయితే 2004లోనే 9 గంటల ఉచిత్ విద్యుత్ అందించిన పార్టీ కాంగ్రెస్‌నే అని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో బెల్లంపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ(Congress Meeting)లో రేవంత్ రెడ్డి పాల్గొని.. ప్రసంగించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనకబడిన జిల్లా ఆదిలాబాద్ అని.. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా వెనుకబడిన జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రూ.38,500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరాన్ని(Kaleshwaram Project) రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు మార్చారన్నారు. గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ(Medigadda Barrage) కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Revanth Reddy Comments Medigadda Barrage : కానీ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎంత వరదొచ్చినా.. తట్టుకొని నిలబడ్డాయని రేవంత్ రెడ్డి హర్షించారు. అలాగే బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు 50 ఏళ్లుగా వరదలకు తట్టుకుని నిలబడ్డాయన్నారు. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కట్టి కట్టగానే కుంగిపోయిందని ఎద్దేవా చేశారు. ఇసుక మీద ప్రాజెక్టులు ఎవరైనా కడతారా.. కాళేశ్వరం పేకమేడ అనుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఇసుకపై బ్యారేజీ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. ఇసుకపై కట్టిన మేడిగడ్డ.. ఇక అణాపైసాకు పనికిరాదని.. అన్నారం అక్కరకు రాదని విమర్శలు గుప్పించారు. దీంతో మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులను మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రచారంలో 'కరెంట్' మంటలు - బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మాటల తూటాలు
Telangana Election 2023 : కాంగ్రెస్ పార్టీకి పట్టాదారుల్లో కాకా కుటుంబం(జి. వెంకటస్వామి) ఒకటని రేవంత్ రెడ్డి చెప్పారు. దిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాకా పేరు మీదనే ఉందన్నారు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కాంగ్రెస్ పనులు ప్రారంభించిందని స్పష్టం చేశారు. వివేక్, వినోద్‌ను ఎమ్మెల్యేలుగా గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలదేనని రేవంత్ స్పష్టం చేశారు. ధరణి మార్చి ప్రత్యామ్నాయంగా మరొకటి తీసుకువస్తామని మాటిచ్చారు. 58 లక్షల రైతులకు రైతు భరోసా అందిస్తామని.. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని వరాలు కురిపించారు. వీరితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రూ.15 వేలు ఇవ్వడానికి సిద్ధమని హామీ ఇచ్చారు.
"ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ అనేవారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన ఆదిలాబాద్ జిల్లా ఇంకా వెనుకబడే ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆదిలాబాద్‌కు 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. తుమ్మిడిగడ్డ దగ్గర నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకుపోయారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఎన్ని వరదలు వచ్చిన తట్టుకుంటున్నాయి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో కింద ఇసుకు కదిలింది. మేడిగడ్డ కుంగిపోయింది." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ రావడం లేదు : రామగుండం సభలో పెద్ద సంఖ్యలో మహిళను చూస్తుంటే కాంగ్రెస్ విజయం సాధించినట్లే. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో 9 రకాల వస్తువులు వచ్చేవి. కానీ బీఆర్‌ఎస్ పాలనలో బియ్యం తప్ప ఏమీ రావట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పోతుందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.. కానీ రైతుబంధు నిధులను పెంచుతామని కాంగ్రెస్ హామి ఇస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
24 గంటల కరెంట్ ముసుగులో వేల కోట్ల దోపిడీ చేశారు : రేవంత్ రెడ్డి