ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఇంటర్ కళాశాలలకు పునరుద్ధరణ అనుమతులు రాకపోవడం అయోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలలు ముందస్తు ప్రవేశాలు తీసుకొని ఉండటంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించిన వాటికే అనుమతులు మంజూరుచేయడం.. లేని వాటిని పునరుద్ధరణకు అవకాశం ఇవ్వడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై సగం ఏడాది గడిచినా.. ఇంకా అనుమతులు రాలేదు. ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశ దగ్గర పడటంతో వాటికి అనుమతులు వస్తాయా..రావా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సక్రమంగా ఉంటేనే..
ఇది వరకు కొన్ని ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులు లేకపోయినా.. ప్రభుత్వ పెద్దలను, అధికారులను మచ్చిక చేసుకొని కొనసాగించేవారు. మరికొన్ని కళాశాలలు ఇతర ప్రాంతాల్లో మౌలిక వసతులు చూపించి.. ఎలాగోలా అనుమతులు సాధించేవి. ప్రతి ఏడాది ఏదో ఒకరకంగా పునరుద్ధరణ చేసుకునేవి. కానీ ప్రభుత్వం ఈ ఏడాది అనుమతుల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), ఆట స్థలం, గుర్తింపు పత్రం, సరిపడా అధ్యాపకులు, సిబ్బంది, అగ్నిమాపక అనుమతులు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు, అద్దె భవనమైతే సంబంధిత పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇదివరకు వీటిలో కొన్ని లేకపోయినా.. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కానీ ఈ ఏడాది నిబంధనలపట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఆయా కళాశాలలు అన్ని సమర్పిస్తేనే అనుమతులు మంజూరు చేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
- జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు: 39
- ప్రైవేటు కళాశాలలు: 21
- పునరుద్ధరణ అనుమతి పొందని ప్రైవేటు కళాశాలలు: 09
అనుమతి ఉందంటూ బురిడీ..
కొవిడ్ కారణంగా ఇంటర్ కళాశాలలు తెరుచుకోలేకపోయినా.. విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మూడు నెలలు గడిచినా.. ప్రవేశాలు, అనుమతుల విషయంలో స్పష్టత కొరవడింది. ప్రస్తుతం అనుమతి మంజూరుకాని కళాశాలలు జిల్లా కేంద్రంలో ఏడు, ఇంద్రవెల్లిలో ఒకటి, ఉట్నూర్‌లో మరో కళాశాల ఉంది. మరోవైపు ప్రైవేటు కళాశాలలు తమకు అనుమతి ఉందంటూ పత్రాలు చూపిస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్ ప్రవేశాల గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది. అప్పటి వరకు కళాశాలలు అనుమతులు తెచ్చుకుంటాయా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ అనుమతి వస్తే సరేసరి.. లేదంటే విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడనుంది. అధికారుల పర్యవేక్షణ, ప్రచార లోపం అనుమతి లేని కళాశాలలకు కలిసివస్తోందనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు కొలువుండే చోటే ఆయా కళాశాలలు బహిరంగంగా అనుమతి లేకున్నా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించడం అనుమానాలకు తావిస్తోంది. కఠినంగా వ్యవహరించడంలో అధికారులు మూములుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల మేరకే అనుమతులు..
ప్రైవేటు కళాశాలలు నిబంధనల మేరకు వ్యవహరిస్తేనే ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆయా కళాశాలలు పునరుద్ధరణ కోసం దరఖాస్తులు సమర్పించాయి. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అనుమతులు రాకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం -సి.రవీందర్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి
ఇవీ చూడండి: పల్సర్ హెడ్లైట్లో పాము.. ఎరక్క వచ్చి ఇరుక్కుంది..