ఎరువుల అమ్మకాల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేయడంతో పాటు, ఎప్పటికప్పుడు నిల్వలు తెలుసుకొని, సరిపడా సరఫరా చేసేందుకు వీలుగా విక్రయదారుల వద్ద పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రైతు ఆధార్‌కార్డు, వేలిముద్ర తీసుకున్న తర్వాతనే ఎరువులు ఇవ్వాలని సూచించింది. దీని వల్ల ఏ రోజు ఎన్ని ఎరువులు అమ్మకం అయ్యాయి. ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉందనే వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుంది.
జరుగుతుంది ఇలా...
కరోనా కారణంగా పీఓఎస్ మిషన్లను వినియోగించడం లేదు. గ్రామాల నుంచి రైతులు ఎరువులకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేసింది. రైతుల ఆధార్‌కార్డు నమోదు చేయడంతో పాటు, ఎరువులను తీసుకెళ్లే వారి వేలిముద్ర తీసుకుంటే సరిపోతుందని సూచించింది. గ్రామానికి చెందిన అయిదారుగురు రైతులు తమ ఆధార్‌కార్డులు ఇచ్చి, ఆటో, లేదా ఇతర వాహన డ్రైవర్లను యూరియాకు పంపిస్తున్నారు. ఎరువుల కొనుగోళ్లలో పరిమితి లేకపోవడంతో ఆధార్‌కార్డుల నెంబర్లు నమోదు చేసి ఎన్ని సంచులు అంటే అన్ని ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు 30-40 మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ పరిస్థితి:
* ఆదిలాబాద్ జిల్లాలో కుమారి గ్రామానికి చెందిన ఓ రైతు 15 మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ముత్నూర్‌కు చెందిన మరో రైతు 12 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అవసరానికి మించి కొనుగోలు చేసిన రైతుల జాబితాను రూపొందించి అధికారులు గ్రామాల్లో విచారణ జరుపుతున్నారు.
* నిర్మల్ జిల్లాలో కుబీర్ గ్రామంలో ఒక రైతు 55 మెట్రిక్ టన్నులు, మరో రైతు 38, గుల్‌మడగలో ఒకరు 45 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తేలింది.
* మంచిర్యాల జిల్లాలో మల్లిడి గ్రామానికి చెందిన ఒక రైతు 22, టేకుమట్ల గ్రామంలో ఓ రైతు 21 మెట్రిక్ టన్నుల ఎరువులు కొనుగోలు చేసినట్లు ఉంది.
* కుమురం భీం జిల్లాలో గూడమామడకు ఒక రైతు 31, రెబ్బెనలో మరో రైతు 25 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ఉంది. జిల్లాల వారీగా అత్యధిక యూరియాను కొనుగోలు చేసిన వంద మంది రైతుల జాబితాలను రూపొందించి, వారికి యూరియా ఎంత అవసరం, ఎందుకు ఎక్కువ కొనుగోలు చేశారనేదానిపై విచారణ చేస్తున్నారు.
సిరికొండ మండలం.. ఇచ్చోడ సహకార సంఘం పరిధిలోకి వస్తుంది. ప్రారంభంలో సిరికొండ మండలానికి యూరియాను తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు.. కొరత ఏర్పడటం, నేతలు జోక్యం చేసుకోవడంతో అమ్మకాలను నిలిపివేశారు. కొరతను దృష్టిలో పెట్టుకున్న ఆయా మండలాల్లోని కొంత మంది వ్యాపారులు రూ.266 ఉన్న యూరియా బ్యాగును రూ.450-500కు అమ్ముతున్నారు.
ఇచ్చోడ మండలం సహకార సంఘం నుంచి రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు.. ఇప్పటి వరకు సంఘానికి 1,552 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ఏడు వేల మంది రైతులకు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. ఇంకా అనేక మంది యూరియా కోసం సంఘం ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఇదే పరిస్థితి అనేక మండలాల్లో ఉంది.
అమ్మకాలపై విచారణ చేస్తున్నాం
కరోనా కారణంగా యూరియా రావడానికి ఆలస్యం అవుతోంది. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి నేరుగా లారీలను పంపించి పంపిణీ చేయిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో యూరియా కొనుగోలు చేసినట్లు ఉన్న వారి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నాం.
- వెంకట్, జిల్లా వ్యవసాయాధికారి
ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'