ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు నడిచే ఆర్టీసీ బస్సుల్లో కరోనా సోకిన వ్యక్తులు ప్రయాణం చేయడం కలకలం రేపుతోంది. ఈ నెల 3న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరిన ఓ బస్సులో నిర్మల్‌కి చెందిన ముగ్గురు తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు కరోనా సోకినట్లు హైదరాబాద్‌లో పరీక్షలు చేయుంచుకున్న నివేదికలు చూపి... ఐసోలేషన్ వార్డులో చేరారు.
ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియగా... ముందుగా ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. ఆదిలాబాద్‌కు రాత్రి 10:30 చేరుకున్న ఆ బస్సును శానిటైజ్ చేశారు. మిగతా ప్రయాణికులు స్వచ్ఛందంగా రిమ్స్ ఆస్పత్రికి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆదిలాబాద్ వైద్యాధికారి సూచించారు. ఆ బస్సులో మొత్తం 23 మంది ప్రయాణం చేసినట్లుగా గుర్తించిన అధికారులు... వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ విషయం ఇటు ఆదిలాబాద్, అటు నిర్మల్ జిల్లాల్లో కలకలం రేపుతోంది.