bullock cart as dowry : అల్లుడంటే తెలుగు ఇళ్లలో రాజుకు ఉండే దర్జా ఇస్తారు. ముఖ్యంగా కట్నకానుకల్లో ఎలాంటి లోటు రానివ్వరు. అతడి మనసు ఖుష్ అయితే కూతుర్ని బాగా చూసుకుంటాడని తల్లిదండ్రుల ఆశ. సాధారణంగా కొత్త అల్లుడికి కట్నంగా బైక్‌లు, కార్లు లేదా బంగారం, స్థిరాస్తి ఇలా ఏదైనా ఇస్తారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి తన అల్లుడికి ఎడ్ల బండి కానుకగా ఇచ్చాడు. దానికి అతని రియాక్షన్ ఏంటో తెలుసుకోండి మరి..
కట్నం లేకుండా కల్యాణం..
bullock cart as dowry in Adilabad : ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామానికి చెందిన పెందూరు లచ్చు, పారూబాయికి ఇద్దరు ఆడబిడ్డలు. వారిలో పెద్ద కుమార్తె లింగుబాయికి అదే గ్రామానికి చెందిన జూగాదిరావుతో ఆదివాసీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. వరుడికి ఎలాంటి కట్నకానుకలు ఇవ్వకుండా ఆచార వ్యవహారాల ప్రకారం పెళ్లి జరిపించడం ఆనవాయితీ.
అల్లుడికి కానుకగా ఎడ్లబండి..
కానీ తన కుమార్తె అత్తింట్లో కష్టపడకూడదంటే.. అల్లుడిని బాగా చూసుకోవాలని భావించిన లచ్చు.. అల్లుడు వ్యవసాయ పని సులభంగా చేసుకునేలా ఎడ్లబండిని కట్నంగా అందించాడు. లక్షల నగదు, హైఫై వాహనాలు, కోట్లలో ఆస్తులు డిమాండ్ చేసే నేటితరం అల్లుళ్లకి పూర్తి భిన్నంగా జూగాదిరావు తన మామ ఇచ్చిన ఎడ్లబండిని ఆనందంగా స్వీకరించాడు. తన కూతురిని అపురూపంగా చూసుకుంటానని ఆందోళన చెందొద్దని ఆ తండ్రికి భరోసానిచ్చాడు. అనంతరం ఎడ్లబండికి పూజచేసి వధూవరులు దానిపైనే వరుడి ఇంటికి బయలుదేరారు.
ఈ వివాహానికి జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ , జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యులు తిరుపతి, ఎంపీపీ జయవంత్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- ఇదీ చదవండి : చెత్త కుప్పలో ఐదు పిండాలు, మానవ శరీర భాగాలు..