కరోనా రక్కసి వ్యాపార, వాణిజ్య వర్గాలనే కాకుండా విద్యా వ్యవస్థనూ అతలాకుతలం చేసింది. పలకా.. బలపం పట్టి బడికి వెళ్లాల్సిన విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. ఇప్పటికే కిందటి విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపించారు. ఈ విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతుందో? లేదో చెప్పలేని పరిస్థితి. ఫలితంగా విద్యార్థులు బడిబాటకు దూరమవుతారనే ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆన్‌లైన్ పాఠాలు ప్రవేశపెట్టాలనే భావనతో ఆదిలాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని సూచించింది.
కొన్ని పాఠశాలలు ప్రారంభించాయి
ఇటీవల రెండురోజుల పాటు ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు ఈ నెల 15, 16వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందించగా.. అక్కడి నుంచి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ సర్వే ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది పదో తరగతిలో చేరిన విద్యార్థులకు మాత్రం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ బోధన చేపట్టాయి.
టీవీలు, చరవాణులు లేవు
ఆన్‌లైన్ పాఠాలు నిర్వహించాలంటే విద్యార్థులందరికీ టీవీలు లేదంటే చరవాణులు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం టీ-శాట్ ద్వారా టీవీలో రోజువారీ పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు టీవీల ముందు కూర్చొని వాటిని వినాలి. ఇక చరవాణులు ఉన్నా జూమ్ యాప్ ద్వారా రోజువారీగా పాఠాలు చెప్పాలని భావించారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇవి అనేక మందికి అందుబాటులో లేవు. ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండకపోవడంతో ముఖ్యంగా టీవీలు ఉన్నా విద్యార్థులు ఆ పాఠాలను వింటారనే భరోసా లేదు. విద్యార్థులకు కలిగిన సందేహాలు తీర్చడం కష్టంగా మారనుంది.
సిగ్నల్ సమస్య అదనం
చరవాణులు కలిగిన తల్లిదండ్రులు ఉదయం పూట పిల్లలకు ఇచ్చి... వారు పనులకు వెళ్లే సమయంలో తీసుకెళ్తుంటారు. ఒకవేళ వాటిని విద్యార్థులకు ఇచ్చినా.. నెట్ బ్యాలెన్స్ వేయించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటర్‌నెట్ ఆన్‌చేసి ఉంటే డాటా త్వరగా ముగిసిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు రూ.10 వేలు విలువ చేసే స్మార్ట్‌ఫోన్లు కొనివ్వడం తల్లిదండ్రులకు కష్టంగా మారనుంది. ముఖ్యంగా జిల్లాలో మారుమూల ప్రాంతాలు అనేక ఉండటంతో సిగ్నల్ సమస్యలు కూడా అవరోధంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉన్నవారికి అమలు చేస్తే.. టీవీలు, చరవాణులు లేని విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతుల కంటే కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆఫ్‌లైన్ బోధన చేస్తేనే ఫలితం ఉంటుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ ప్రభావం లేని ప్రాంతాల్లో బడులు పునఃప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ బోధన ప్రారంభించాయి. వారి భవిష్యత్తు దృష్ట్యా ముందస్తు పాఠాలను చెబుతున్నాయి. జిల్లాలోని కూర ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 20 మంది విద్యార్థులు ఉంటే 17 మంది వద్ద చరవాణులు అందుబాటులో ఉన్నాయి. మిగతా వారికి సమన్వయ పరుస్తూ ఆన్‌లైన్ బోధన అమలు చేస్తున్నారు. కానీ పాఠశాలలో చదివే అందరు విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన చేయాలంటే మాత్రం కష్టమే.
నివేదిక సమర్పించాం
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు రోజుల పాటు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. జిల్లాలో ఎంతమంది విద్యార్థుల ఇళ్లలో టీవీలు, కేబుల్ సౌకర్యం, చరవాణులు ఉన్నాయో వివరాలు సేకరించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
- రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!