టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) భారత్‌కు మరో రజత పతకం దక్కింది. ఆదివారం జరిగిన పురుషుల హైజంప్ పోటీల్లో టీ47 కేటగిరిలో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్ 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు రజతం సాధించాడు. ఇక ఈ పోటీల్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ రామ్ పాల్ 1.94మీటర్ల ఎత్తు ఎగిరి ఐదో స్థానంలో నిలిచాడు.
అమెరికాకు చెందిన టౌన్సెండ్ రొడిరిక్ 2.15 మీటర్ల ఎత్తు ఎగిరి గోల్డ్ మెడల్ దక్కించుకోవడం సహా ప్రపంచ రికార్డు సాధించాడు. కాంస్యం కూడా ఆ దేశానికి చెందిన డల్లాస్ వైస్‌కు వరించింది.
అంతకుముందు భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.
మోదీ శుభాకాంక్షలు
రజతం గెలిచిన నిషాద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. "టోక్యో నుంచి మరింత ఉత్సాహనిచ్చే వార్త. నిషాద్‌కుమార్ రజతం గెలవడం ఆనందంగా ఉంది. అతడు అసాధారణమైన నైపుణ్యం కలిగిన అథ్లెట్. తనకు నా శుభాకాంక్షలు" అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.