నవోమీ ఒసాకా తండ్రి హైతీకి చెందిన లియోనార్డో ఫ్రాంకాయిస్. తల్లి తమాకి ఒసాకా జపాన్ మహిళ. అమెరికాలో చదువుకుంటున్నప్పుడు వీళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది. కానీ వాళ్ల పెళ్లికి తమాకీ ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో జపాన్‌లోని ఒసాకాకి పారిపోయి కాపురం పెట్టారు. అక్కడే వీళ్లకి మారీఒసాకా, నవోమీ ఒసాకాలు పుట్టారు. సాధారణంగా వీళ్లకి ఇంటిపేరుగా తండ్రి పేరే రావాలి. కానీ జపాన్‌లో ఉండటానికి ఏ ఇబ్బందులూ రాకూడదనే తల్లిపేరుని కలుపుకొన్నారు. జపాన్‌లో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలు నవోమీ కుటుంబాన్ని అంగీకరించడానికి 15 సంవత్సరాలు పట్టింది.
నవోమీ పుట్టిన మూడేళ్లకు జపాన్ నుంచి ఫ్రాంకాయిస్ తన కుటుంబాన్ని తీసుకుని న్యూయార్క్‌లో ఉన్న లాంగ్ ఐలాండ్‌కి వెళ్లిపోయాడు. అదే సమయంలో వీనస్ విలియమ్స్, సెరెనా విలియన్స్‌లు ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడి ప్రపంచాన్ని తమవైపునకు తిప్పుకొన్న రోజులు. ఆ అక్కాచెల్లెళ్ల ఆట ఫ్రాంకాయిస్‌ని ఎంతగా ఆకర్షించిదంటే.. తన కిష్టమైన టెన్నిస్ క్రీడాకారుడు రిచర్డ్ విలియమ్స్ రాసిన పుస్తకాలూ, డీవీడీలు చూసి తన పిల్లలు కూడా విలియమ్స్ అక్కాచెల్లెళ్లా రాణించాలని స్వయంగా టెన్నిస్ నేర్పించాడు. అలా నవోమీ మూడేళ్ల వయసులో రాకెట్‌ని చేతపట్టింది. ఫ్రాంకాయిస్ కోరుకున్నట్టుగా తన ఆడపిల్లలు ఇద్దరూ టెన్నిస్‌లో అద్భుతంగా రాణించడం మొదలుపెట్టారు.
"పొద్దుటే లేవడం అంటే నరకం. రోజంతా ఆట ఆడి మళ్లీ ఉదయాన్నే లేవాలంటే ఒంట్లోని ఎముకలన్నీ విరగ్గొట్టినట్టుగా ఉండేవి. సాధారణంగా ప్రతి ఆడపిల్లకూ ఉండే సరదాలే మాకూ ఉండేవి. కానీ ఆట వల్ల వాటికి దూరం అయ్యాం. పార్టీలు లేవు. ఫ్రెండ్స్ లేరు. నాకు అక్క... అక్కకు నేను. ఎప్పుడైనా మేం లాంగ్‌రైడ్స్‌కి వెళ్లినప్పుడు కారులో వెనకాల కూర్చుని వేసే డూడుల్స్ మాత్రం ఆనందాన్నిచ్చేవి. పైపెచ్చు మేమంత ఉన్నవాళ్లం కాదు. అప్పుడు నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి.. నాలోని బెస్ట్‌ని చూపించి ఉన్నతంగా బతకడం. రెండు అమెరికాలో ఇల్లు లేని అనాథలా మిగిలిపోవడం. రెండోదానికన్నా మొదటిదే మంచిదనిపించింది"
- నవోమీ ఒసాకా.
నవోమీ పరమ సిగ్గరి. ఎంతగా అంటే కోర్టులో ఎదుటివారి ముందు కళ్లలో కళ్లుపెట్టి చూసి ఆడలేనంతగా. ఆమె తీరు కోచ్‌కి విసుగు తెప్పించేది. ఆ బలహీనత నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించింది.
"నేను పరమ సిగ్గరిని. నాలోని భావోద్వేగాలను బయటపెట్టడానికి కూడా చాలా బిడియపడేదాన్ని. అందుకేనేమో చాలామంది నువ్వు ఓడిపోయిన సందర్భాల్లో కూడా నీలోని నెగెటివ్ ఫీలింగ్స్‌ని భలే బ్యాలెన్స్ చేస్తావే అనేవారు. 'అవునేమో' అనుకునేదాన్ని మనసులో" అనే నవోమీ సమయం వచ్చినప్పుడు తన మనసులోని భావాలని వెల్లడించడానికి ఏమాత్రం సిగ్గుపడదు. అందుకు ఉదాహరణ అమెరికాలో జార్జ్‌ఫ్లాయిడ్ మరణాన్ని వ్యతిరేకిస్తూ నల్లజాతీయులకు అండగా నిలిచి తన గొంతుకను వినిపించింది.
ఆమె శరీరఛాయ చాలా చిత్రంగా ఉంటుంది. నలుపు, ఎరుపు కలిసిన టెర్రాకోట మట్టి రంగు అంటారు ఫ్యాషన్ ప్రేమికులు. భిన్నమైన శరీరఛాయ, ఆకృతి కారణంగానే ఎన్నో మల్టీనేషనల్ బ్రాండులకు ఆమె మోడల్‌గా వ్యవహరిస్తోంది.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియన్ ఓపెన్: మహిళల సింగిల్స్ విజేత ఒసాకా