WTA suspends all tournaments in China: టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి భద్రత విషయంలో పట్టు విడవని మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చైనాకు షాకిచ్చింది. ఆ దేశంలో తక్షణమే అన్ని డబ్ల్యూటీఏ టోర్నీలు నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూటీఏ అధ్యక్షుడు స్టీవ్ సిమన్ సంచలన ప్రకటన చేశాడు. పెంగ్ ఆచూకీపై స్పష్టత రాకపోతే 2022 తర్వాత కూడా ఆ దేశంలో జరిగే టోర్నీలు రద్దు చేసే అవకాశమూ ఉందని అతను వెల్లడించాడు.
Peng Shuai WTA Statement: ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలి తనను లైంగికంగా హింసించాడని గత నెల రెండో తేదీన చైనాకు చెందిన పెంగ్ సామాజిక మాధ్యమాల్లో ఆరోపించింది. అప్పటినుంచి పెంగ్ కనిపించకపోవడం వల్ల ఆమె ఆచూకీ కోసం పెద్ద ఉద్యమమే మొదలైంది. ఆమె ఎక్కడుందంటూ జకోవిచ్, ఒసాక, సెరెనా, ఫెదరర్, నాదల్ లాంటి టెన్నిస్ ప్లేయర్లతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్, యూకేతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఆమె భద్రతపై స్పష్టతనివ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండే చైనా మీడియాలో ఆమె సురక్షితంగానే ఉందనే ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్.. పెంగ్‌తో అరగంట పాటు వీడియో కాల్‌లో మాట్లాడాడని వార్తలు వచ్చాయి. కానీ వాటిని నమ్మని డబ్ల్యూటీఏ అధ్యక్షుడు సిమన్ ఆమె ఆచూకీ కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆమె స్వేచ్ఛగా, సురక్షితంగా ఉందని తెలియకపోతే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటామని, టోర్నీలు నిర్వహించబోమని హెచ్చరించాడు. చెప్పినట్లుగానే ఇప్పుడు చైనాతో పాటు హాంకాంగ్‌లో జరగాల్సిన టోర్నీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. డబ్ల్యూటీఏ బోర్డు డైరెక్టర్లు, ప్లేయర్లు తదితరుల మద్దతులోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
WTA Tournaments in China: చైనా ఏడాదికి 10 డబ్ల్యూటీఏ టోర్నీలతో పాటు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు ఆతిథ్యమిస్తోంది. పెంగ్‌తో తానే స్వయంగా మాట్లాడి ఆమె సురక్షితంగానే ఉందని తెలుసుకుని, ఆమె ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపేందుకు డ్రాగన్ ప్రభుత్వం ఒప్పుకోవాలని సిమన్ డిమాండ్ చేశాడు. డబ్ల్యూటీఏ నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించింది. "క్రీడలను రాజకీయం చేసే చర్యలను మేమెప్పుడూ తీవ్రంగా వ్యతిరేకిస్తాం" అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపాడు.
ఇవీ చూడండి