పాకిస్థాన్‌లో జరిగే డేవిస్కప్నకు సిద్ధమవుతోంది భారత్. వచ్చే నెల 14-15 తేదీల్లో జరగనుంది. ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సలీమ్ సైఫుల్లా ఖాన్ స్పందించారు. పర్యటక జట్టుకు అత్యుత్తమ రీతిలో ఆతిథ్యమిస్తామని తెలిపారు. ఈ పోటీలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిలిచేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు.
"భారత టెన్నిస్ జట్టు రాక కోసం ఎదురుచూస్తున్నాం. ఆటగాళ్లకే కాకుండా ఆ దేశం నుంచి వచ్చే అభిమానులకూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పోటీని చాలా భద్రతతో ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించాలని అనుకుంటున్నాం. పాక్ ఆతిథ్యంతో పర్యటక జట్టు ఆనందం వ్యక్తం చేస్తుందని అభిప్రాయపడుతున్నా." -సలీమ్ సైఫుల్లా ఖాన్, పాకిస్థాన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ఓ భారత టెన్నిస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం 55 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1964లో పర్యటించిన మన జట్టు ప్రత్యర్థిపై 4-0 తేడాతో గెలిచింది.
"మ్యాచ్‌లు జరిగే ప్రదేశమంతా రెడ్ జోన్‌గా ప్రకటించాం. ఎందుకంటే ఆ దగ్గర్లోనే పార్లమెంట్, ప్రధాని నివాసం ఉన్నాయి. భారతీయ క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని హామీ ఇస్తున్నా. మా దేశంలోని టెన్నిస్ క్రీడాకారులకు సదుపాయాలు తక్కువ. భారత్‌తో ఆడటం వల్ల వారికి స్పాన్సర్షిప్ దొరికే అవకాశముంది." --సలీమ్ సైఫుల్లా ఖాన్, పాకిస్థాన్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
దాదాపు 5 దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌లో డేవిస్ కప్ నిర్వహించడం, భారత్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం రావడమనేది దేవుడి వరమని అన్నారు సైఫుల్లా ఖాన్.
ఇది చదవండి: వింబుల్డన్‌లో దూసుకెళ్లిన యువ సంచలనం కోరీ గాఫ్