యుఎస్ ఓపెన్‌ను తొలిసారి సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రపంచ మూడో ర్యాంకర్ థీమ్ (ఆస్ట్రియా) సెమీస్ చేరాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో అతను 6-1, 6-2, 6-4 తేడాతో 21వ సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. టోర్నీ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వస్తోన్న అతను ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. ప్రత్యర్థిని వరుస సెట్లలో చిత్తుచేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ చేరిన 21 ఏళ్ల డిమినార్.. థీమ్ జోరు ముందు నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో థీమ్ 11 ఏస్‌లు, 43 విన్నర్లు కొట్టాడు. యుఎస్ ఓపెన్‌లో తొలిసారి సెమీస్ చేరిన ఆస్ట్రియా ఆటగాడిగా థీమ్ రికార్డు సృష్టించాడు. ఉత్కంఠగా సాగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7-6 (8/6), 6-3, 7-6 (7/5)తో తన దేశానికే చెందిన పదోసీడ్ రుబ్లెవ్‌పై గెలిచాడు. మ్యాచ్ మూడు సెట్లలోనే ముగిసినప్పటికీ ఆటగాళ్లిద్దరి పోరాటం ఆకట్టుకుంది.
ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక్క సెట్ కూడా కోల్పోని ప్రపంచ అయిదో ర్యాంకర్ మెద్వెదెవ్ ఈ మ్యాచ్‌లో కూడా కీలక సమయంలో పైచేయి సాధించి గెలుపు తీరాలకు చేరాడు. ఇద్దరూ పోటాపోటీగా తలపడడం వల్ల తొలి సెట్ టైబ్రేకర్‌కు దారితీసింది. అందులో ఓ దశలో 5-1తో.. ఆ తర్వాత 6-3తో ఆధిక్యంలో నిలిచిన రుబ్లెవ్ గెలిచేలా కనిపించాడు. కానీ అద్భుతంగా పుంజుకున్న మెద్వెదెవ్ ప్రత్యర్థిని వెనక్కునెట్టాడు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రెండో సెట్లో పెద్దగా కష్టపడకుండానే మెద్వెదెవ్ నెగ్గాడు. ఇక మూడో సెట్లో వీళ్లు మరోసారి ఆటను రక్తికట్టించారు. దీంతో మళ్లీ టైబ్రేకర్‌కు వెళ్లడం.. ఈ సారి కూడా మెద్వెదెవ్ నెగ్గడం వల్ల రుబ్లెవ్ ఇంటి ముఖం పట్టాడు. మ్యాచ్‌లో మెద్వెదెవ్ 16 ఏస్‌లు, 51 విన్నర్లు కొట్టాడు. సెమీస్‌లో అతను.. థీమ్‌తో పోటీపడనున్నాడు. మరో సెమీస్‌లో పాబ్లో, జ్వెరెవ్ ఢీకొననున్నారు.
మరో అడుగు
మహిళల సింగిల్స్‌లో టైటిల్ దిశగా మాజీ నంబర్‌వన్ అజరెంక (బెలారస్) మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్స్‌లో ఆమె 6-1, 6-0 తేడాతో మార్టిన్స్ (బెల్జియం)ను చిత్తుచేసింది. 31 ఏళ్ల అజరెంక అనుభవం ముందు 25 ఏళ్ల మార్టిన్స్ నిలవలేకపోయింది. సెమీస్‌లో ఈ అమ్మ.. మరో తల్లి సెరెనాతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో ఒసాకాను బ్రాడీ ఢీకొననుంది.