కొవిడ్ నేపథ్యంలో అసలు ఒలింపిక్స్ జరగాలా? వద్దా? అనే విషయంపై అథ్లెట్లు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందని తెలిపాడు స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్. ఈ మెగా ఈవెంట్ విషయంలో తనకు రెండు ఆలోచనలు ఉన్నట్లు పేర్కొన్నాడు. జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహణకు వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ఫెదరర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ గురించి అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నిజాయితీగా చెప్తున్న నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలియడం లేదు. ఒలింపిక్స్‌లో ఆడటమంటే నాకిష్టం. అందులో గెలిచి స్విట్జర్లాండ్‌కు మెడల్ సాధించాలని ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నా కోరిక నెరవేరేలా లేదు. ఒకవేళ ఈ మెగా ఈవెంట్ ఆగిపోయిన నేను అర్థం చేసుకోగలను. ఆటల నిర్వహణ పట్ల జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లైతే.. అక్కడికి వెళ్లకపోవడమే మంచిది."
-రోజర్ ఫెదరర్, స్విస్ టెన్నిస్ దిగ్గజం.
దాదాపు అన్ని పెద్ద ట్రోఫీలను కైవసం చేసుకున్న ఈ 39 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్.. ఒలింపిక్స్ మెడల్ మాత్రం సాధించలేకపోయాడు. జపాన్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే మూడు నగరాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో క్రీడలకు ఆతిథ్యమిస్తున్న హొక్కయిడో నగరం కూడా ఉంది.
మరికొన్ని ప్రాంతాల్లో మే చివరి వరకు అత్యవసర పరిస్థితి విధించారు. క్రీడల నిర్వహణ ద్వారా కేసులు పెరుగుతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఒలింపిక్స్ జరిగేది అనుమానంగానే అనిపిస్తోంది.
ఇప్పటికే నవోమి ఒసాకా, రఫెల్ నాదల్ వంటి క్రీడాకారులు ఒలింపిక్స్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ అవసరమా అంటూ ఒసాకా ఇటీవల ప్రశ్నించింది.
ఇదీ చదవండి: టీకా ఇస్తామన్న ఫ్రాంఛైజీలు.. తిరస్కరించిన క్రికెటర్లు!