టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా శ్రీలంకతో(SRI vs SA T20) జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ బావుమా (50) రాణించగా.. మార్‌క్రమ్ (19) ఫర్వాలేదనిపించాడు. చివర్లో ఉత్కంఠ ఏర్పడినా.. డేవిడ్ మిల్లర్ (23), రబాడ (13) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, చమీర రెండు వికెట్లు పడగొట్టారు.
లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దుష్మంత చమీర వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర్లు రీజా హెండ్రిక్స్ (11), క్వింటన్ డికాక్ (12) పెవిలియన్ చేరారు. డస్సెన్ (16) రనౌటయ్యాడు. దీంతో పది ఓవర్లకు దక్షిణాఫ్రికా 62/3 వద్ద నిలిచింది. తర్వాత బావుమా, మార్‌క్రమ్ నిలకడగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. 15 ఓవర్‌లో మార్‌క్రమ్ ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 96/4. దీంతో సౌతాఫ్రికా గెలిచేలా కనిపించింది. కానీ, 18 ఓవర్‌లో హసరంగ మాయ చేశాడు. బావుమా, ప్రిటోరియస్‌ని పెవిలియన్‌కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, రబాడ ధాటిగా ఆడటంతో ఒక బంతి మిగిలుండగానే ఆ జట్టు విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. నార్జ్ వేసిన నాలుగో ఓవర్‌లో శ్రీలంక తొలి వికెట్‌ని కోల్పోయింది. అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో ఓపెనర్ కుశాల్ పెరీరా (7) ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి 39/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన చరిత్ అసలంక (21), మరో ఓపెనర్ పీతమ్ నిశాంకతో కలిసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే కేశవ్ మహరాజ్ వేసిన 9వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4) వరుసగా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే శ్రీలంక మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వచ్చిన దసున్ శనక (11), చమిక కరుణరత్నే (5), దుష్మంత చమీర (3) వరుసగా పెవిలియన్ చేరారు. మహేశ్ తీక్షణ (7) నాటౌట్‌గా నిలిచాడు. నిశాంక రాణించినా అతడికి సహకరించే బ్యాటర్ లేకపోవడంతో శ్రీలంక పెద్దగా స్కోరు చేయలేకపోయింది.దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్ షంసి, డ్వెయిన్ ప్రిటోరియస్ మూడేసి, అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: