పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు వీరిద్దరూ ట్రెక్కింగ్‌లో వారి సామర్థ్యాలను మించి రాణిస్తున్నారు. చిన్నవయసులోనే ఔరా అనిపించేలా సాహసాలు చేస్తున్నారు. అలవోకగా ఎత్తయిన కొండలను ఎక్కేస్తున్న కామ్యాపై ఇటీవలే 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా మరో క్రీడాకారిణి ఈశాన్వి ప్రతిభను గుర్తిస్తూ 'ఈనాడు' గౌరవ పురస్కారంతో సత్కరించింది. నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా వారి విశేషాలు చూద్దాం.
కిలిమంజారో ఎక్కేసింది
నిరంతరాయంగా వర్షం కురుస్తున్నా, గజగజ చలి వణికిస్తున్న బెదరలేదు ఈశాన్వి. గుండెలనిండా ఆత్మవిశ్వాసంతో ఆఫ్రికాలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించింది. పదకొండేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి, అందరి ప్రశంసలు అందుకుంది.
కరీంనగర్‌కు చెందిన ఈశాన్వి.. చిన్ననాటి నుంచి చురుకే. కానీ ఏదైనా చేసేముందు తనవల్ల అవుతుందో కాదో అన్న ఓ చిన్న భయం ఆమెలో ఉండేది. తండ్రి శ్రీకాంత్ మాత్రం ఆమెలో ఆత్మవిశ్వాసం నింపాడు. కూతురి భయాన్ని పోగొట్టేందుకు తనతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లేవాడు. అలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్న ఈశాన్వి.. గత అక్టోబర్‌లో ఏకంగా కిలిమంజారో పర్వాతాన్నే అధిరోహించింది. తాజాగా ఈ చిన్నారి ప్రతిభను గుర్తిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా 'వసుంధర' పురస్కారంతో సత్కరించింది 'ఈనాడు' సంస్థ.
" ఈ అవార్డు దక్కడానికి ముఖ్య కారణం మా నాన్న. కిలిమంజారోను అధిరోహించడానికి ముందు నేను వేరు, ఇప్పుడు వేరు. నాలో దాగి ఉన్న బలం గురించి తెలుసుకునేందుకు ఆయన నాతో ఈ ప్రయత్నం చేయించారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్నది సాధించగలిగాను. ఈ ప్రయత్నంతోనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోగలననే నమ్మకం నాలో బలపడింది. ఈ అవార్డు నాలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతుంది"
-- ఈశాన్వి
ఎత్తయిన రికార్డు పట్టేసింది
చిన్న వయసులోనే ఎన్నో ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది పన్నెండేళ్ల కామ్యా కార్తికేయన్. ముంబయికి చెందిన ఈ చిన్నారి.. ఇటీవల దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం అకోంకాగువాను ఎక్కేసింది. దాని ఎత్తు 6,962 మీటర్లు. ఎప్పుడూ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. వణుకు తెప్పించే చలిలో తండ్రితో కలిసి తొమ్మిది రోజులు నడిచింది కామ్యా. క్యాంప్-2 వరకు చేరింది. ఆ చలికి తట్టుకోలేదని అధికారులు ఆ అమ్మాయిని వెనక్కి పంపారు. అయినా పట్టుపట్టి మళ్లీ తన సాహస యాత్ర ప్రారంభించి, ఎట్టకేలకు లక్ష్యం చేరుకుంది. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు కొట్టింది.
అంతకుముందు పదేళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిందీ కామ్యా. లద్దాఖ్‌లోని స్టోక్ కాంగ్డి పర్వత శిఖరానికి చేరిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అయితే ఇలా పర్వతారోహణకు ఈ చిన్నారి రోజూ సాధన చేస్తుంటుంది. పదిహేను అంతస్తుల భవనాన్ని ఆరు కిలోల బరువుతో ఎక్కి దిగడం.. ఎన్నో కిలోమీటర్లు నడవడం... మరెన్నో కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం లాంటివి చేసేస్తుంది. అందుకే కామ్యా సాహసం, విజయం ఎందరికో ప్రేరణగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మన్‌కీ బాత్'లో మెచ్చుకున్నారు. ఆమె గెలుపులో ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యముందంటూ కామ్యాకు అభినందనలు చెప్పారు.