భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పసిడి ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 53 కిలోల విభాగంలో ఆమె ఓటమి పాలైంది. తనకన్నా బలమైన ప్రత్యర్థి మేయు ముకైదా(జపాన్) చేతిలో ఓడింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్ ఫైనల్లో ... రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ముకైదా చేతిలో 0-7 తేడాతో పరాజయం చెందింది ఫొగాట్. ఫలితంగా వరుసగా రెండోసారి ఇదే అమ్మయి చేతిలో కంగుతింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫొగాట్.. చాలా ప్రయత్నించినా గెలవలేకపోయానని నిరాశ వ్యక్తం చేసింది.
"రెజ్లింగ్ క్రీడలో జపాన్ బలంగా ఉంది. ఆ అమ్మాయిలపై దూకుడుగా ఆడేందుకు కాస్త సమయం పడుతుంది. ఒక టెక్నిక్‌తో కూడిన కదలిక, ఒక పాయింట్ పోరాటాన్నే మార్చేస్తుంది. నేనెంతో ప్రయత్నించినా ముకైదాను ఓడించడం కుదర్లేదు. ఆమె గెలిచింది".
-- వినేశ్ ఫొగాట్, భారత రెజ్లర్
పతకం కోసం చివరి ఆశ....
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు పతకం గెలవని వినేశ్‌కు... కాంస్యంతో పాటు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. ఎందుకంటే ఫొగాట్ చేతిలో గెలిచిన ముకైదా.. సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ఈమె గనుక ఫైనల్‌కు చేరితే... రెపిఛేజ్ రూపంలో వినేశ్‌కు మరో ఛాన్స్ దక్కనుంది.
రెపిఛేజ్‌లో కాంస్య పతకం గెలవాలంటే యులియా బ్లహిన్యా (ఉక్రెయిన్), ప్రపంచ నంబర్ వన్ సారా అన్ హిల్దెబ్రాండ్ మరియా ప్రెవోలరకిను వినేశ్ ఓడించాలి. ఒలింపిక్ విభాగంలో జరిగిన మరో పోరులో సీమా బిస్లా (50 కిలోలు)కు చుక్కెదురైంది. ప్రిక్వార్టర్స్ ఫైనల్లో 2-9 తేడాతో మూడుసార్లు ఒలింపిక్ పతక విజేత మరియా స్టాద్నిక్ చేతిలో ఆమె పరాజయం పాలైంది.
ఇవీ చూడండి...