దక్షిణాసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. షూటింగ్, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండియా ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మంగళవారం జరిగిన టోర్నీలో 19 ఏళ్ల మెహులీ ఘోష్ పసిడి కైవసం చేసుకొంది. ఫైనల్లో 253.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
మెహులీ స్కోరు ప్రస్తుత ప్రపంచ రికార్డు (అపూర్వి చందేలా, 252.9) కంటే 0.4 పాయింట్లు ఎక్కువ కావడం విశేషం. అయితే ఈ క్రీడల్లో సాధించిన రికార్డులను ప్రపంచ షూటింగ్ సమాఖ్య పరిగణలోకి తీసుకోదు. ఇదే విభాగంలో భారత షూటర్లు శ్రీయాంక రజతం, శ్రేయ అగర్వాల్ కాంస్యం గెలిచి మూడు పతకాలను స్వీప్ చేశారు.
వాలీబాల్‌లో పాక్‌ను ఓడించి...
వాలీబాల్‌లో భారత్ రెండు స్వర్ణాలు గెలిచింది. పురుషుల ఫైనల్లో భారత్ 2-1తేడాతో పాకిస్థాన్‌ను ఓడించగా.. మహిళల తుది సమరంలో భారత్ 3-2 తేడాతో నేపాల్‌పై నెగ్గింది.
అథ్లెట్లు అదరహో..
రెండో రోజు పోటీల్లో భారత్ 11 స్వర్ణాలతో సహా 27 పతకాలు గెలుచుకుంది. అర్చన సుశీంద్రన్ (మహిళల 100 మీ), జష్నా (మహిళల హైజంప్), సర్వేశ్ అనిల్ (పురుషుల హైజంప్), సరోజ్ (పురుషుల 1500 మీ)లో పసిడి కైవసం చేసుకున్నారు. రుబీనా (హైజంప్, కాంస్యం), చేతన్ (హైజంప్, రజతం), చందా (1500 మీ, రజతం), చిత్ర (1500 మీ, కాంస్యం) పతకాలు సాధించారు.
టేబుల్ టెన్నిస్‌లో రెండు పసిడి పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల జట్టు ఫైనల్లో 3-0తో నేపాల్‌ను, మహిళల టీమ్ తుది సమరంలో శ్రీలంకను ఓడించి స్వర్ణాలు గెలుచుకున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు 18 స్వర్ణాలు సహా 43 పతకాలతో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది.