PV Sindhu: బిజీ సీజన్లో సరైన ఈవెంట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఇప్పటివరకు అందకుండా చేజారుతున్న కామన్వెల్త్, ఆసియా గేమ్స్ టైటిళ్లను ఈ ఏడాది ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉందామె. ఈ ఏడాది జులై-ఆగస్టులో బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో చైనాలో ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు.
ఈ ఏడాది కూడా షట్లర్ల కోసం బిజీ షెడ్యూల్ వేచిచూస్తోంది. మేజర్ ఈవెంట్స్‌తో పాటు ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకునేందుకు రెగ్యులర్‌గా జరిగే సూపర్-1000, సూపర్- 750, సూపర్-500 లాంటి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. మంగళవారం నుంచి ఇండియా ఓపెన్ ఆరంభం కానున్న నేపథ్యంలో తన ప్రణాళికల గురించి వివరించింది సింధు.
"ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్స్తో పాటు కామన్వెల్త్ గోల్డ్, ఆసియా గేమ్స్ టైటిల్, ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలవాలని ఆశిస్తున్నా. చాలా టోర్నమెంట్లు జరుగుతున్నాయి కాబట్టి, సరైన ఈవెంట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ర్యాంకింగ్స్ కూడా చాలా ముఖ్యం. ప్రతి టోర్నీకి మానసికంగా, శారీరకంగా చాలా ఫిట్‌గా ఉండాలి. ప్రతిసారి 100 శాతం కృషిచేయాలి. ప్రాక్టీస్‌లో 100 శాతం కష్టపడితేనే మ్యాచ్‌లో రాణించగలుగుతాం. కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ప్రయత్నంలో విఫలం కాకూడదు."
-పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
2021లో అద్భుతంగా రాణించింది సింధు. 2016లో రియో ఒలింపిక్స్ రజతానికి గతేడాది టోక్యోలో గెలిచిన కాంస్యాన్ని జతచేసింది. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సిల్వర్ సాధించిన సింధు.. టైటిల్ మాత్రం చేజార్చుకుంది. ఈ ఏడాది మాత్రం ఆ లెక్క సరిచేయాలని చూస్తోంది.
సంతృప్తికరంగా ఉన్నా..
"గతేడాది పలు విజయాలు, అపజయాలు చవిచూశాను. మొత్తంగా నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నా. కొన్ని సెమీఫైనల్స్ ఉన్నాయి, వరల్డ్ టూర్ ఫైనల్ సిల్వర్, ప్రపంచ ఛాంపియన్షిప్స్ క్వార్టర్స్‌లో ఓడాను. కానీ అక్కడా నా అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చా. ఇక ఒలింపిక్ పతకం నాకెంతో గర్వకారణం" అని సింధు పేర్కొంది.
2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధు.. 2021 ఆరంభంలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో తడబడింది. అయితే మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్ ఫైనల్ చేరి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. అనంతరం జరిగిన టోక్యో మెగాటోర్నీలో కాంస్యం సాధించింది.
రెండు నెలల విరామం తర్వాత.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్లను సెమీస్‌తో ముగించింది. చివరగా వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రజతం పట్టేసింది. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్‌ను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. 2017 తర్వాత పతకం లేకుండా తొలిసారి వెనుదిరిగింది.
రెడీగా ఉన్నా..
"గతేడాది వరుస టోర్నమెంట్లలో ఆడిన కారణంగా ప్రపంచ ఛాంపియన్షిప్స్ తర్వాత ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నా. ఈ కొత్త సంవత్సరాన్ని ఇండియా ఓపెన్‌తో మొదలుపెడుతున్నా. బాగా సన్నద్ధమయ్యాను. ఈ ఏడాది కూడా బిజీ షెడ్యూల్ ఉంది. దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పింది సింధు.
ఇండియా ఓపెన్‌లో భారత్‌కే చెందిన శ్రీకృష్ణ ప్రియతో తన పోరును ఆరంభించనుంది సింధు. ఈ టైటిల్‌ను 2017లో సింధు గెలుచుకుంది. రెండు సార్లు ఇండియా ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్, థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్, సింగపూర్‌కు చెందిన జియా మిన్ యోతోనూ టైటిల్ కోసం పోటీపడనుంది సింధు.
ఇదీ చూడండి: సింధుకు సులువైన డ్రా.. శ్రీకాంత్, సైనాకు మాత్రం..