ఎంతో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వాయిదాపడ్డాయి. కరోనా ప్రభావంతో క్రీడాకారులు టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు రేకెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. అయితే ఇలా మెగాటోర్నీ వాయిదా పడటం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ యుద్ధం అనే ప్రస్తావన లేకుండా ఒలింపిక్స్ వాయిదా పడటం ఇదే తొలిసారి.
బెర్లిన్ ఒలింపిక్స్ -1916
జులై 4, 1912 స్టాక్ హోమ్ సమావేశంలో ఆరో ఒలింపిక్స్ బెర్లిన్‌లో జరగబోతున్నట్లు ప్రకటించారు. అలెగ్జాండ్రా, ఆమ్స్టర్డమ్, బ్రసెల్స్, బుడాపెస్ట్, క్లేవ్లాండ్ కూడా పోటీపడినప్పటికీ జర్మన్ రాజధానికే మొగ్గుచూపారు నిర్వాహకులు. అయితే మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ఈ క్రీడలు రద్దయ్యాయి.
టోక్యో -1940
2011లో భూకంపం, సునామీలతో అతాలకుతలమైన జపాన్‌కు 2020లో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వచ్చింది. అలాగే 1940 నాటి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. 1923లో వచ్చిన భారీ భూకంపం నుంచి కోలుకుంటోన్న సమయంలోనే 1940 ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు సాగుతుండగా ఐఓసీ టోక్యోకు ఆతిథ్య హక్కులు రద్దు చేసి హెల్సింకోలో నిర్వహించాలని నిర్ణయించింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడటం వల్ల ఐఓసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ, చివరికి రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
లండన్-1944
1944లో లండన్‌లో జరగాల్సిన క్రీడలను కూడా రెండో ప్రపంచ యుద్ధమే అడ్డుకుంది. ఒలింపిక్ వేదిక నిర్ణయించిన మూడు నెలల్లోనే బ్రిటన్.. జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఫలితంగా విశ్వక్రీడలు వాయిదాపడ్డాయి.
అఫ్ఘానిస్థాన్‌పై సోవియట్ యూనియన్ దాడిని నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికా, చైనా, జపాన్ సహా 66 దేశాలు బాయ్‌కాట్ చేశాయి. టోర్నీ మాత్రం రద్దవ్వలేదు. కానీ, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉన్న సమయంలో ఒలింపిక్స్ వాయిదా పడడం ఇదే తొలిసారి.