స్పెయిన్ లెజెండరీ ఫుట్‌బాలర్ ఇకర్ కాసిల్లాస్ సంచలన ట్వీట్ చేశాడు. తాను గే (స్వలింగ సంపర్కుడు) అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 'మీరు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను, నేను గేను' అని పేర్కొన్నాడు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా దాచినందుకు నా పట్ల ద్వేషభావాన్ని ప్రదర్శించబోరని అనుకుంటున్నా అంటూ వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతడికి పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. అతని మద్దతుదారుల్లో బార్సిలోనా మాజీ కెప్టెన్ కార్లెస్ పుయోల్ కూడా ఉన్నాడు.
ట్వీట్లో ట్విస్ట్.. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇకర్ కాసిల్లాస్ సోషల్ మీడియాలో తాను గేనంటూ పేర్కొన్న ట్వీట్ తర్వాత డిలీట్ చేశాడు. అయితే గతేడాది తన భార్య సారాతో విడిపోయాక.. కాసిల్లాస్ నటి అలెజాండ్రా ఒనీవాతో రిలేషన్లో ఉన్నాడని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ రూమర్స్‌కు చెక్ పెట్టి టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాంక్ ట్వీట్ చేశాడని నెటిజన్లు భావించారు. మరోవైపు అతడి అకౌంట్ హ్యాక్ అయిందని కూడా వార్తలు వచ్చాయి.
కాగా, ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ అయిన రియల్ మాడ్రిడ్‌కు చాలా ఏళ్లుగా గోల్ కీపర్‌గా సేవలందించాడు కాసిల్లాస్. అలాగే స్పెయిన్ జాతీయ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. ఓ ప్రపంచకప్, రెండు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లు, ఐదు లా లిగా ఛాంపియన్‌షిప్‌లు, మూడు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను గెలుపొందిన జట్టులో కీలక సభ్యుడిగా కాసిల్లాస్ ఉన్నాడు. అతడు గతంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ సారా కార్బోనెరోను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు 2021 మార్చిలో విడిపోయారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు.
ఇదీ చూడండి: 'కోహ్లీ చేసిన ఆ రెండు సెంచరీలు నా ఫేవరెట్.. మళ్లీ ఆ మ్యాజిక్ చూడాలని ఉంది'