ఎన్ని అడ్డంకులు వచ్చినా టోక్యో ఒలింపిక్స్ మాత్రం ఆగవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. చివరికి జపాన్ మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించినా, మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పింది.
ఒలింపిక్స్ ప్రారంభానికి సరిగ్గా ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఓ వైపు జపాన్లోని దాదాపు 80% ప్రజలు ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల నిర్వహణకు వ్యతిరేకత చూపుతున్నారు. క్రీడల నిర్వహణ వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని స్థానిక వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశంలోని ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా కూడా క్రీడలను ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించొచ్చని అంటున్నారు అధికారులు. దీంతో పాటు ఒలింపిక్ క్రీడా గ్రామంలో 80శాతానికిపైగా ప్రజలకు టీకాలు ఇవ్వాలని సూచించారు.
జులై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా క్రీడల్లో మొత్తం 11వేల ఒలింపిక్ క్రీడాకారులతో పాటు 4వేల మంది పారాలింపిక్స్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: 'ఇంగ్లాండ్ టూర్లో అతడికే నా తొలి ప్రాధాన్యత'