IOC Session 2023: వచ్చే ఏడాది ముంబయిలో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 2023 సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకుంది. దీంతో 40 ఏళ్ల తర్వాత మనకు ఆ గౌరవం లభించింది. 1983లో చివరిసారి దిల్లీలో ఈ ఐఓసీ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ ఆ విశిష్ట సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 139వ ఐఓసీ సెషన్‌లో భారత బృందం ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యులకు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి ఒప్పించింది. ఇందులో 2008 ఒలింపిక్స్ బంగారు పతక విజేత అభినవ్‌బింద్రాతో పాటు ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
కాగా, ఈ విషయం పట్ల ఐఓసీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కిందని, దీంతో భారత్‌లోని యువత ఈ ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని ఆమె అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడం మన కల అని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి : IND VS WI: కోహ్లీ నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: రోహిత్ శర్మ