కరోనా ప్రభావం వల్ల ఈ జులై నుంచి జరగాల్సిన ఒలింపిక్స్.. వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే టోక్యోలో నిర్వహించే ఈ మెగాక్రీడల్ని మరోసారి వాయిదా వేయడం అసాధ్యమని స్పష్టం చేశారు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరొ మోరి. 2021 జులై 23న ఎట్టి పరిస్థితిలోనైనా ప్రారంభమవుతాయని అన్నారు. వాయిదా వ్యవధి పెరిగితే సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని అన్నారు. ఈ విషయాల్ని ఓ వార్త ఏజెన్సీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒలింపిక్స్ రెండేళ్ల వాయిదాపై జపాన్ ప్రధాని షింజో అబెతో తాను మాట్లాడానని చెప్పిన మోరి.. ఆయన ఏడాది సమయం సరిపోతుందని చెప్పినట్లు పేర్కొన్నారు.
కరోనా ప్రభావం తగ్గితే ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది ఘనంగా జరపాలని నిర్వాహక కమిటీ భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటం వల్ల 2021 జులైలోనైనా ఈ క్రీడల నిర్వహణ సాధ్యమవుతుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'చెన్నై ధోనీని తీసుకోవడం నాకు బాధ కలిగించింది'